శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ :

ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. వర్షకాలం సీజనులో ఇప్పటివరకు 61 టీఎంసీల నీరు వచ్చింది. ఈనెల 10వ తేదీన ఉదయం ప్రాజెక్ట్‌ లో 34 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. 15 వ తేదీ వరకు ఎగువ ప్రాంతాల నుంచి  భారీగా వరద రావడంతో 52 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. కేవలం ఐదు రోజుల్లో 20 టీఎంసీల వరద వచ్చి చేరింది.

ఎస్సారెస్పీ నీటిమట్టం రోజురోజూకు పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 52 టీఎంసీల నీరుంది. ఇన్‌ ఫ్లో కొనసాగుతుండడంతో మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ నీటితో ప్రాజెక్టు కింద యాసంగి పంటలు సాగుచేసుకోవచ్చని ఆయకట్టు రైతులు ఆనందపడుతున్నారు.

ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు కాకతీయ, సరస్వతి, లక్ష్మి, వరద కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈ కాలువ ద్వారా యాసంగి సాగుకు ఎంత నీటిని విడుదల చేయాలో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ ఫ్లో కొనసాగడం నిలిచిపోతే ఉన్న నీటి సామర్ధ్యంతో ఏఏ కాలువకు ఎంత నీటిని విడుదల చేయాలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ లో 56 టీఎంసీల నీటినిల్వ ఉంటే ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చంటున్నారు. సుమారు 7 లక్షల ఎకరాల్లో రబీలో పంటలు సాగుచేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఈ నెల 28వ తేదీన తిరిగి మూసేస్తారు. ఇదే విధంగా ఇన్‌ ఫ్లో కొనసాగితే అంతలోపు ప్రాజెక్ట్‌ లోకి మరో ఐదారు టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.