శ్రీవారి సేవలో పద్మాదేవేందర్ రెడ్డి
తిరుమలలో తగ్గని రద్దీ
తిరుమల,మే30(జనం సాక్షి): తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ,తోమాల సేవలలో శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం ఆలయ అధికారులు పద్మా దేవేందర్ కు స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలావుంటే కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమలలో వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టిటిడి అధికారులు బుధవారం 20వేల సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా, మంగళవారం శ్రీనివాసుడిని 80, 176 మంది భక్తులు దర్శించుకోగా, 42, 199 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టిటిడి అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లుగా లెక్కించారు.