శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాముల ఆందోళన
కేరళ ప్రభుత్వం, హిందువుల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మల దహనం
తెనాలిలో హిందూ వాహినీ కార్యకర్తల ఆందోళన
శుక్రవారం తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చిన హిందూ వాహినీ
హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి తుక్కుగూడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆపై కేరళ ప్రభుత్వం, హిందువుల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్ద సంఖ్యలో స్వాములు ఆందోళనలో పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణతోపాటు ఆంధ్రాలో గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్‌లో హిందూ వాహినీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అలాగే శుక్రవారం తెనాలి పట్టణ బంద్‌కు హిందూ వాహినీ పిలుపునిచ్చింది.