షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన మంత్రి గంటా
నెల్లూరు, జూలై 20 : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీనటి త్రిష శుక్రవారంనాడు నగరంలోని సిరికళ మెగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో పెళ్ళిళ్లకు, ఇతర పర్వదినాల్లో బట్టలు కొనుగోలు చేయాలంటే వివిధ షాపులకు వెళ్లాల్సి వచ్చేది అని, ప్రస్తుతం షాపింగ్ మాల్స్ సంప్రదాయం అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల దుస్తులు ఒకే షాపింగ్ మాల్స్‌లో లభిస్తున్నందున కొనుగోలుదార్లకు ఉపయుక్తంగా ఉందని అన్నారు. నగరంలో సుమారు పది రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయని, వీటన్నింటిలో నిరంతరం వ్యాపారాలు జరగడాన్ని పరిశీలిస్తే ప్రజలు షాపింగ్ మాల్స్ పట్ల ఎంతో మొగ్గు చూపుతున్నారని అన్నారు. త్రిష మాట్లాడుతూ, మొదటి సారిగా తాను నెల్లూరు వచ్చినప్పటికీ ఇక్కడి సిరికళ షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్ద నగరాలను తలదన్నే విధంగా అందమైన డిజైన్లలో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికళ షాపింగ్ మాల్స్ యజమాని కందుకూరు సత్యనారాయణ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.