సంక్షేమంలో మనమే నంబర్ వన్: ఎమ్మెల్యే
మెదక్,జనవరి18(జనంసాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పక్షాన ప్రజలు ఉండేలా చేయాల్సి ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రామలు దేశానికి ఆదర్వంగా నిలుస్తాయని అన్నారు.గ్రామాలు అభివృద్ధి చెందకుండా దేశాభివృద్ధి సాధ్యపడదని అన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు, డిసెంబరులో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలుఉన్నాయన్నారు. ఇందుకు తెరాస శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు ఎక్కువ శాతం పరోక్షంగానే జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, అధికారాలతో పాటు నిధులనూ ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను ధరణి కార్యక్రమం ద్వారా మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రైతులకు అందజేయ నున్నామని, ఇది దేశ చరిత్రలోనే ఉన్నతమైన ప్రయోగమని వివరించారు.రైతులకు ప్రధానంగా వచ్చేది భూమి సమస్యలేనని, దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన పక్రియ చేపట్టిందని స్పష్టం చేశారు. రెండు మూడేళ్లలో రాష్ట్రంలో 25వేల మెగావాట్లకు విద్యుతుత్పత్తికి చేరుకోనుందని, ఎత్తిపోతల పథకాలకు ఎనిమిదివేల మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉందన్నారు. ఉగాది కల్లా మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు ప్రతి గ్రామానికి చేరుతుందని, ఉన్న ట్యాంకులే కాకుండా మరో 700 ట్యాంకులు మంజూరు చేశామన్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెరాస శ్రేణులకు పిలుపునిచ్చారు.