సంక్షేమంలో ముందున్న తెలంగాణ

అభివృద్దిని చూసి పట్టం కట్టాలి: రామలింగారెడ్డి

సిద్దిపేట,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయంగా వృద్ధి సాధించిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు బూటకపు మాటలు చెబుతూ పక్కతోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దేశాన్ని సర్వనాశనం చేశాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆకర్షితులై గ్రామగ్రామాన యువకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి రూ.4 వేల చొప్పున వారికి పెట్టుబడిని అందజేస్తున్నామన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా గ్రామగ్రామాన కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పేద వారికి కంటి చూపును ప్రసాదిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పేదింటి ఆడ పడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ.100116 కేసీఆర్‌ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా గ్రామంలోని మహిళలకు పౌష్ఠికాహారం అందిస్తుందన్నారు. అమ్మఒడి, కేసీఆర్‌ కిట్లను సైతం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గత పాలకుల హయాంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కేజీ టూ పీజీలో భాగంగా ఆంగ్లమాధ్యమంలో విద్యను అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను గెలిపించి టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా ఉండాలన్నారు.