సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: ఎమ్మెల్యే
సిద్దిపేట,జూన్26(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతూ ఆర్థిక రంగంలో మొదటి స్థానంలో నిలిచిందని టిడిపి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగే టీటీడీపీ నాయకులు ప్రజాసంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు చవకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్ దక్కదన్నారు. మిషన్ కాకతీయతో నీటి కరువు దూరమయ్యిందని రైతులకు, వృత్తిదారులకు ప్రభుత్వం ఆపన్న హస్తాన్ని అందించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అందించిన గొర్రెలతో, సంక్షేమ పథకాలతో ఓ వైపు ఉపాధి బట్టి పని చేసుకుంటుంటే, ప్రభుత్వ పథకాలపై పనిలేని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్,టిడిపి నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారన్నారు. గొర్రెల పంపిణీలో ఏజెన్సీలు ఉన్నాయని, యాదవులు లంచాలు ఇచ్చారని చేసిన ఆరోపణలు శుద్ద అబద్దమని అన్నారు. పూటకోమాట మాట్లాడుతూ ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి వారు పాటుపడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అద్భుతమైన పాలన చూసి ప్రజా సంక్షేమానికి సహకరించాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేనిపక్షంలో తగిన రీతిలో స్పందించి ఘాటైన సమాధానం చెప్తామన్నారు.