సంక్షేమ పథకాలు చూడలేకే విమర్శలు
మహబూబ్‌నగర్,నవంబర్17(జనంసాక్షి): పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.45వేల కోట్ల నిధులతో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాజకీయ దురుద్ధేశంతో పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్లు పెంపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, కాలువల ద్వారా వ్యవసాయనికి సాగునీరు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ కృష్ణ జలాలు, గొల్ల, కురుమలకు 75శాతం సబ్సిడీతో రుణాలు అందజేశారని తెలిపారు. గర్భిణులకు అమ్మబడి, కేసీఆర్ కిట్టు, ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు చేయించుకుంటే రూ.12వేల ఆర్థిక సహాయం వంటి పథకాలతో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికీ ఉచిత నల్ల కనెక్షన్ ద్వారా శుద్ధజలం అందిస్తామని తెలిపారు. అన్ని రంగాల వారిని అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిచాలని ప్రభుత్వం చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైందని అన్నారు. నూతన సంవత్సరం నుంచి రాష్ట్రమంతటా సాగుకు 24గంటల విద్యుత్ అందించే ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి సాగుకు 24గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణ ప్రభుత్వం రిక్డారు సృష్టించనుందన్నారు. దశాబ్దాల పాటు విద్యుత్ కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపికబురని అన్నారు.