సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి
నాలుగేళ్లలో అభివృద్ధిని చూసి తాను గర్వపడుతున్నా
ప్రజాసేవలో ఉన్న ఆనందం మరే రంగంలోనూ ఉండదు
మంచిని చెడుగా చూపాలని చూసేవారి ఆటలు సాగవు
ఎవరు మంచివారో.. ఎవరు చెడ్డవారో ప్రజలకు తెలుసు
పచ్చదనం పెంపుపై ప్రజలను చైతన్యపర్చాలి
టెలీ కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి,జూన్7(జనం సాక్షి): రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తున్నామని, అందువల్లే అన్నివర్గాల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కల్పించడం వల్లే ప్రజల్లో భరోసా, ఆనందం అగుపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు నిర్వహణపై గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పంటకుంటలు నిండాయని, ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని సీఎం అన్నారు. భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. పంటకుంటల సందర్శనలో అందరూ పాల్గొని రైతులు, గ్రావిూణ ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేస్తే.. భవిష్యత్తులో ఇంకెంత చేస్తుందో అనే భరోసా ప్రజల్లో రావాలన్నారు. ఆరో రోజు దీక్షల సందర్భంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించాలని, నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, ఓడీఎఫ్, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఇలా అన్నింటినీ సందర్శించాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. నాలుగేళ్ళలో సాధించిన అభివృద్ధి చూసి తాను గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ఉన్నంత ఆనందం, సంతృప్తి మరే రంగంలోనూ రాదని.. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమని అన్నారు. మంచిని చెడుగా, చెడును మంచిగా చూపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వాళ్ల కుట్రలు, కుతంత్రాలు నెరవేరవని చంద్రబాబు అన్నారు. ఎవరు మంచో, ఎవరు చెడో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు.