సంపూర్ణ మరుగదొడ్ల నిర్మాణం సాగాలి
పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చేయాలి
మెదక్,జూలై7(జనం సాక్షి): వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ధికారులకు సూచించారు. సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా మెదక్ జిల్లాను ప్రకటించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు ప్రభుత్వపరంగా అందే పింఛన్లు, చౌకధరల వస్తువులు సరఫరా నిలిపివేసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలుతీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్క కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. మెదక్ జిల్లాను సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకువాలని.. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాగానే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటనున్న హరితహారాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. గ్రామ, మండల స్థాయిలో చేపట్టే హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో ప్రజాప్రతినిధులను, హరిత రక్షణ కమిటీలను భాగస్వాములుగా చేయాలని సూచించారు.
————-