సకాలంలో చర్యలు తీసుకుంటేనే సమస్యలు దూరం

ప్రభుత్వ సంస్థలు గిట్టుబాటు ధరలు చెల్లించాలి

వరంగల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) :ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో రంగప్రవేశం చేయకపోవడం వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని పలుగ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలు ఆలస్యంగా కొనుగోల్లు చేపడితే లాభం ఉండబోదన్నారు. కొందరు రైతులైతే మద్దతు ధర వచ్చే వరకు ధాన్యాన్ని ఉదయం ఆరబెట్టకొని సాయంత్రం కుప్పపోసి టార్ఫాలిన్లు కప్పుకునేందుకు రోజుకు రూ.300నుంచి రూ.500 వరకు ఖర్చుచేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో ఎటుచూసినా రాశులుపోయిన ధాన్యం, బస్తాల్లో ఉన్న ధాన్యం, ఆరబోయిన ధాన్యంతో నిండిపోయింది. ప్రైవేట్‌ ట్రేడర్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయించి రైతును నిలువునా నిండా ముంచుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం పెద్దఎత్తున వస్తున్నా, కొనుగోళ్లకు ప్రభుత్వ రంగసంస్థలు ఇప్పటి వరకు ముందుకురాని పరిస్థితి ఉందన్నారు. సీజన్‌లో ముందుగానే కొనగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే కనీసం ఏ గ్రేడు ధాన్యం, మక్కలు పండించే రైతులకు కొంతమేరకైనా న్యాయం జరిగేదన్నారు. లావాదేవీలు సగం పూర్తయిన తర్వాత మార్కెట్‌కు వస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు వ్యాపారులతో చేతులు కలిపి తేమ, తాలు సాకుతో నామమాత్రపు కొనుగోళ్లతో సరిపెట్టి, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థ ప్రతినిధులే ఊతం ఇస్తున్నారని ఆరోపించారు. మార్కెట్‌కు వస్తున్న సరుకుల్లో కనీసం 50 శాతంప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేసినా రైతులకు కనీస మద్దతు ధర లభించి మేలు జరుగుతుందన్నారు. ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. ఇక ప్రైవేట్‌ వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం లేకుండామార్కెట్‌లో లావాదేవీలు పూర్తిచేసి ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లభించే విధంగా అటు వ్యాపారులు, ఇటు ట్రేడర్లు, రైస్‌ మిల్లర్లను సమన్వయం చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు.