సచ్ఛీలుడివైతే లైడిటెక్టర్‌ టెస్ట్‌కు ఓకేనా: పొన్నం

నల్లగొండ: మంత్రి జగదీశ్‌రెడ్డిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి సచ్ఛీలుడైతే లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధం కావాలని సవాలు విసిరారు. కోర్టుకెళ్లినంత మాత్రాన అవినీతి నుంచి బయటపడలేవంటూ మంత్రిని ఎద్దేశా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో తనకు సంబంధం లేదంటున్న మంత్రి మరెవరికి సంబంధం ఉందో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఎందుకు ఆదేశించరని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం వహించినందుకే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారని పొన్నం ఆరోపించారు. 1200మంది అమరులకు రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బలమైన ప్రతిపక్షం కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని పొన్నం కోరారు.