సజావుగా ధాన్యం కొనుగోళ్లు

గతం కన్నా పెరిగిన అమ్మకాలు

గిట్టుబాటు ధరతో పాటు ఖాతాల్లో సొమ్ము జమ

మెదక్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు జోరుగా ధాన్యం కొనుగోళ్లు కూడా చేపట్టడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇందులో117 పీఎసీఎస్‌ల ఆధ్వర్యంలో, 68 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.రైతులు పండించిన ప్రతి ధాన్యంగింజ కొనడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, ప్ర త్యేక సాఫ్ట్‌వేర్‌లో ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపరిచేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత నిలువ చేసింది, రైతులకు ఏ రోజు బిల్లులు చెల్లించనున్నారనే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించడానికే మొగ్గుచూపారు. జిల్లాలో మొత్తం 1,46,329 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గ్రేడ్‌ -1 ధాన్యానికి క్వింటాకు రూ.1,590, గ్రేడ్‌ -2 కు రూ.1,550 చెల్లిస్తున్నారు. జిల్లాలో రైతులు పండించిన పంట దళారుల భారీన పడి నష్టపోకుండా కలెక్టర్‌ ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు. రైతులు పండించిన పంట ను నేరుగా కొనుగోలు కేం ద్రాలకు తరలించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ధాన్యానికి మంచి మద్దతు ధర ఇవ్వడంతోపాటు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. యాసంగి కోతలు మొదలు కాగానే జిల్లావ్యాప్తంగా సహకార శాఖ ఆధ్వర్యంలో 117 కేంద్రాలు, ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో 68 కేంద్రాలు, మొత్తం 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రెండురోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మొత్తం రూ.232 కోట్ల 66 లక్షలు చెల్లించాల్సి ఉండగా..ఇప్పటివరకు రూ.231 కోట్ల 63 లక్షలను చెల్లించారు. మిగిలిన రూ.కోటిని రెండురోజుల్లో జమ చేయనున్నారు. గతేడాదితో పోల్చితే యాసంగిలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. సింగూరు, ఘణపూర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతోపాటు చెరువులు, కుంటల కింద విస్తారంగా వరి సాగు అయ్యింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంది. నిత్యం ఎంత ధాన్యం వచ్చింది, ఎంత నిలువ చేసింది, రైతులకు ఏ రోజు బిల్లులు చెల్లించనున్నారనే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో చెల్లింపులు సాఫీగా సాగాయి. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని చెప్పారు.