సడక్‌బంద్‌లో సీపీఐ పాల్గొంటది

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నారాయణ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
ఈ నెల 24న తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌కు సిపిఐ రాష్ట్ర శాఖ సంపూర్ణమద్దతు పలికింది. మంగళవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలతోనే సాధ్యమని అన్నారు. పోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు నారాయణ తెలిపారు. సడక్‌ బంద్‌ను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. గత 11 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యుపిఎ ప్రభుత్వాన్ని నమ్ముకొని మోసపోయిన కేసిఆర్‌ తిరిగి ఎన్డీఎ వల్లేవేయడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. తెలంగాణ కోసం అవసరమైతే ఎన్డీయే మద్దతు తీసుకుంటామని అన్నారు. కేసిఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్డీయే కూడా యుపిఎ మాదిరిగా తెలంగాణ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకున
ప్రమాదం ఉన్నదని నారాయణ హెచ్చరించారు. అందుకే ఒకరిని బ్రతిమిలాడి తెలంగాణ తీసుకువచ్చుకునే బదులు పోరాటాల ద్వారానే సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కృషి చేస్తున్న నేతల మధ్య ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నారాయణ అ భిప్రాయపడ్డారు. ఎన్డీయేతో తెలంగాణ వస్తుందని కేసిఆర్‌ భావించడం పెనంపై నుండి పోయ్యిలో పడినట్టేనని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా కార్మికులు ఈ నెల 20. 21 తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా మార్చి 4, 5 తేదీల్లో పార్టీ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని నారాయణ అన్నారు. ఇందులో ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తామని నారాయణ అన్నారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఆడిన నాటకాలు చాలవన్నట్టు సమస్య పరిష్కారంకోసం మూడవ కృష్ణుడైన రాహుల్‌గాంధీ బయలుదేరారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ సాధ్యం కాదని నారాయణ అన్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు జాప్యం కావడం వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికలను కూడా మూండంచెల పద్ధతిలో నిర్వహించాలని ఆయన సూచించారు.