సత్ఫలితాలు ఇస్తున్న బడిబాట

స్కూళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది

మహబూబ్‌నగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిఇవో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే ఫలలను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి డీఈవో సుశీందర్‌ రావు సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ జరుగుతోందని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు పోటీ ఇస్తూ సర్కారు బడుల్లోనూ మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించినా నాణ్యమైన, గుణాత్మక విద్య లభించడం లేదని చాలా మంది తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగ్గా విద్యాబోధన చేయాలని డీఈవో సుశీందర్‌ రావు ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలు వదిలేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్ర స్థాయిలో గతేడాది సుమారు 50 వేల మంది విద్యార్థులు సర్కార్‌ బడుల్లో విద్యనభ్యసించారు. జిల్లాలో సుమారు 1000 మందికి పైగా ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యార్థులకు ఉన్నత శ్రేణి విద్యను అందించేందుకు అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పన, కంప్యూటర్‌ పరిజ్ఞానం కోసం డిజిటల్‌ క్లాసులు, పర్యావరణం పై అవగాహన కోసం స్వచ్ఛ స్కూల్‌, క్రీడలు, పోటీ పరీక్షలకు శిక్షణ, ఆంగ్ల విద్యాబోధన, పరిశోధనపై పట్టు కో సం ల్యాబ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అదనపు తరగతులతో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలకు మిం చిన ఉత్తమ విద్యను అందిస్తున్నారు. అన్నింటికీ మించి అత్యున్నత ప్రతిభావంతులైన క్వాలిఫైడ్‌ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉన్నారు. 7 నుంచి 12 వరకు విద్యార్థినులకు తొలిసారిగా హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కి ట్స్‌ అందిస్తూ.. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇన్ని సౌకర్యాలు వచ్చిన తరుణంలో సర్కార్‌ బడులకు విశేష స్పందన వస్తోంది. ఈ తరుణంలోనే బడిమానేసిన పిల్లలు, బడి ఈడు పిల్లలు బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలలకు వస్తున్నారు. జిల్లాలో బడిబాటను ప్రారంభించగా చక్కని స్పందన కనిపిస్తోందని బడిమానేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్య వల్ల కలిగే ప్రయోజనాలను వివరించామని డిఇవో తెలిపారు. గ్రామాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో బడిబాట ర్యాలీలు నిర్వహించాం. సర్కార్‌ కల్పిస్తున్న వసతులు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో చేరేవిద్యార్థుల సంఖ్య గతంలో కంటే వేగంగా పెరుగుతోందన్నారు.