సత్యం గెలిచిందట!

335577
– తన క్లీన్‌చిట్‌పై యెడ్డీ

బెంగళూరు,అక్టోబర్‌ 26(జనంసాక్షి): అవినీతి ఆరోపణ కేసులో నిర్దోషిగా బయటపడటంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు అనుకూలంగా ఉండి ముడుపులు తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించడంతో యడ్యూరప్పకు వూరట లభించింది. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ ‘సత్యమేవ జయతే..’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘న్యాయమే గెలిచింది. ఈ కేసులో న్యాయస్థానం క్లీన్‌చిట్‌ ఇచ్చింది, కష్ట సమయంలో నా వెంట అండగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.’ఇది భాజపాకు పెద్ద విజయం. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. ఇక ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజుదే తొలి విజయం. నాపై రాజకీయ కుట్ర జరిగింది. ఇది నాకు, నా కుటుంబానికి పునర్జన్మ లాంటిది’ అన్నారు. దీనిపై ఎవర్నీ నిందించను, దేవుడికి అంతా తెలుసని ఆయన న్యాయస్థానం ఎదుట విూడియాతో మాట్లాడిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.సీఎంగా యడ్యూరప్ప ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు మద్దతుగా వ్యవహరించడంతో పాటు రూ.40కోట్లు ముడుపులు పుచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ 2012 అక్టోబర్‌లో యడ్యూరప్పతో పాటు మరో 12 మందిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో ఆయన ఇద్దరు కొడుకులు, బంధువు ఒకరు ఉన్నారు. 2012 ఆగస్టు, సెప్టెంబర్‌ మధ్య కాలంలో బీవై రాఘవేంద్ర, బీవై విజేంద్ర, సోహన్‌కుమార్‌ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20కోట్లు డిపాజిట్‌ అయినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూకి మద్దతుగా ఉన్నందుకు గాను వీరు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎట్టకేలకు వీరందరూ నిర్దోషులుగా ప్రకటిస్తూ బుధవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది.