సత్వర న్యాయం కోసం ఆలోచించాలి
హత్య,అత్యాచార కేసుల్లో తక్షణ న్యాయం అనేది సాధ్యపడదని స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్దే చేసిన ప్రకటన ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అశనిపాతంగా చూడాలి. న్యాయానికి కూడా ఓ సమయం ఉండాలి. ఎప్పటిలోగా న్యాయం జరుగుతుందన్న దానికి కూడా స్పష్టత ఉండాలి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యల చూస్తుంటే సామాన్యులకు చట్టంపై నమ్మకం ఉంటుందా అన్నది ఆలోచించాలి. విచారణ జరిపి నిజనిర్దారణ జరిగిన తరువాతనే న్యాయవ్యవస్థలకు అనుగుణంగా శిక్షణలు విధించాలని చీఫ్ జస్టిస్ట్ అన్నారు. న్యాయమనేది ఇన్‌స్టెంట్‌గా జరగడం కుదరదని కూడా బోబ్డే స్పష్టం చేశారు. పగ, ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమన్న భావనకు వస్తే.. జస్టిస్ అనేది దాని స్వరూపాన్ని, అర్థాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల జరుగుతున్న ఘటనలతో న్యాయం వేగంగా జరగాలని, న్యాయవ్యవస్థ మారాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు. కచ్చితంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని, విచారణ ఆలస్యం తగదని, కానీ, ఇన్‌స్టెంట్ జస్టిస్ అనేది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జస్టిస్ అనేది ఎప్పటికీ ప్రతీకారంగా మారకూడదని, అలా జరిగితే జస్టిస్ అనేది దాని స్వరూపాన్ని కోల్పోయినట్లే అని కూడా అన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయడం గురించి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో కొత్త టెక్నాలజీల అవసరం ఉందని జస్టిస్ బోబ్డే అన్నారు. ప్రజలకు న్యాయం అందుబాటులోకి వచ్చేలా ఉన్న వ్యవస్థల్ని పటిష్టం చేయాలని సీజేఐ చెప్పారు. న్యాయవ్యవస్థలో ఆలస్యం వల్ల నిరాశ, నిస్పృహతో ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. నిజంగా దిశ కేసులో సత్వర న్యాయాన్ని ప్రజలు కోరుకున్నారు. గతంలో కేసులను చూసిన తరవాత ప్రజల్లో ఓ రకమైన అసమనం నెలకొంది. అందుకే ఎన్‌కౌంటర్ జరగ్గానే ప్రజలంతా ముక్తకంఠంతో పోలీసులు చర్యను సమర్థించారు. వారికి జేజేలు పలికారు. ఇకపోతే ఏడేళ్ల క్రి నిర్భయ కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష అముల కాలేదు. ఇదికూడా ప్రజల్లో అసహనానికి కారణమయ్యింది. అలాగే తెలంగాణలో జరిగిన మరో రెండుమూడు కేసుల్లో జాప్యంపై ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆందోళనకు దిగారు. ఇక్కడ ప్రధానంగా వెనకబడి, దళితులకు సంబంధించిన కేసుల్లో ఇంత అన్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే యూపిలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్లకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇక్కడ దిశ ఆందోళన జరుగు తున్న సమయంలోనే ఈ ఘటన జరిగి దేశంలో సంచలనం కలిగించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వచ్చిన స్పందనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషులకు మరణశిక్ష పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ అమలు జరగలేదు. తొమ్మిదేళ్ల పసి బాలికపై అత్యాచారం కేసులో కింద కోర్టు విధించిన మరణశిక్షను పైకోర్టు యావజ్జీవ శిక్షగా సవరించింది. అత్యా చారాలకు, హత్యలకు బలైన బిడ్డల తల్లి దండ్రులు తీరని కడుపుకోత వేదనను అనుభవిస్తుంటే, నేరస్తులు మాత్రం నిర్భయంగా సంచరిస్తున్న ఘటనలు జనంలో న్యాయస్థానాల తీర్పుపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి. ఇలా అత్యాచారాలు, హత్యలు జరుగుతూ పోతున్నా న్యాయం కోసం ప్రజలు తక్షణం ఆశించ రాదన్న రీతిలో చీఫ్జస్టిస్ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ప్రజలు తమకు జరిగిన న్యాయం కోసం ఎంతకాలం వేచి చూడాలి. నేరగాళ్లకు భయమెలా కలగాలి. నేరాలు జరక్కుండా ఏమి చేయాలి. అమ్మాయిల వంక చూడ కుండా ఏం చేయాలి.. వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నిజంగా న్యాయవ్యవస్థలో మార్పులకు ప్రస్తుత తాజా పరిణామాలు భూమిక కావాలి. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. అలాగే ప్రజలకు తక్షణ న్యాయం జరగం కోసం ఆలోచన చేయాలి. ఇప్పటికే దేశంలోని వివిధ కోర్టుల్లో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. క్రిమినల్ కేసులే రెండు కోట్లు ఉన్నట్లు అంచనా. ఇందులో పదోవంతు కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో వున్నాయి. నేషనల్ కైమ్ర్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం 2017లో 32,500 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అప్పటికే పెండింగ్‌లో వున్న వాటితో కలిపి ఈ సంఖ్య లక్షా 46 వేలకు చేరింది. వాటిలో ఆ సంవత్సరం వివిధ కోర్టుల్లో పరిష్కారమైన రేప్ కేసుల సంఖ్య 18,300 మాత్రమే. అంటే ఏటా పదిశాతం కేసులు పరిష్కారమవుతుంటే 30 శాతం కేసులు పెండింగ్ జాబితాకు అదనంగా తోడవుతున్నాయి. సంస్థాగతమైన లోపాలతో మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ దినదినం దిగజారిపోతోంది. పెరుగుతున్న జనాభా, అందుకుతగ్గట్లుగా వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాల సంఖ్య, జడ్జీల సంఖ్య పెరిగి ఉండాల్సింది. పెరగకపోగా జడ్జీ పోస్టుల్లో ఎప్పుడూ చాలా భాగం భర్తీ కాకుండా ఖాళీగానే వుంటున్నాయి. భారతదేశంలో వున్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలంటే 70 వేలమంది అదనపు జడ్జీలు అవసర మవుతారని మూడేళ్ల కింద అప్పటి ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ పరిస్థితి కూడా అదేవిధంగా వున్నది. సాధారణ స్థాయిలో నేరాలు జరిగే దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు 225 మంది పోలీసులుండాలని లెక్క వుంది. నేరాలు ఎక్కువగా జరిగే భారతదేశంలో మాత్రం లక్షకు 138 మంది పోలీసులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సత్వర న్యాయంకావాలంటే ఏం చేయాలో పాలకుల ఆలోచన చేయాలి. ప్రజలకు అసమనం కలగకుండా ఏలా వ్యవహరించాలో అందుకు ఏం చేస్తే బాగుంటుందో అలా చేయాలి. అప్పుడు పోలీసులు కూడా తీర్పుచెప్పే అవకాశాలు తగ్గుతాయి.