సబ్సిడీ పథకాలతో లబ్దిపొందాలి

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ ఏడీ ప్రకాశ్‌ పాటిల్‌ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ పై బిందు సేద్యం పరికరాలు సరఫరా చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. ప్రతి ఏడాది పంట మార్పు చేసుకుని కొత్త పంటలు వేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో వాణిజ్య పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా భూమి ఉందన్నారు. తక్కువ నీటితో చెరుకు పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు. బోరు, బావుల వద్ద బిందు సేద్యం పరికరాలు వేసుకోవాలన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీ పై బిందు సేద్యం పరికరాలు ఇస్తుందన్నారు. చెరుకు, అల్లం, టమాట, పసుపుతో పాటు మామిడి, జామ తోట లను సాగు చేసేందుకు రైతులు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. కూరగాయలు సాగు చేసేందుకు రైతులకు సబ్సిడీ పై నారు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.