సమన్వయంతో పని చేస్తూ సౌకర్యాలు కల్పించాలి

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి 18005728980 టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకోండి
•జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్.
 నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్17 జనంసాక్షి:
         మహిళా శిశు సంక్షేమ శాఖ వివిధ లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలోని దివ్యంగులు, పిల్లలు, వృద్ధులు, మహిళల సమస్యలు పరిష్కరించడంలో బాసటగా నిలవాలని   అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు.  గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొ  జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ లతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం    నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యంగులు, గర్భిణీలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అనాధ పిల్లలకు సంబందించిన సమస్యలు వారి సంక్షేమం కొరకు పనిచేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖకు వివిధ లైన్ డిపార్ట్మెంట్ వారి సమన్వయ సహకారం తో పనిచేయాల్సిన అవసరం ఉంటుందని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న దివ్యంగులు సంఘం ప్రతినిధులు పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు.  డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ దివ్యంగులు దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యంగులకు  3 రోజుల పాటు క్రీడలు నిర్వహించాలని, సదరం ధ్రువీకరణ పత్రాలు లబ్ధిదారులకు చేరడం లేదని వాటిని సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, దివ్యంగులు అందరికి ఉచిత బస్ పాస్ లతో పాటు వారి వెంట ఉండే అటెండర్ కు కూడా ఉచిత బస్ పాస్ జారీ చేసే విధంగా చూడాలని కోరారు.  పోలీస్ స్టేషన్లలో దివ్యంగుల పై జరిగిన అన్యాయం పై కేసులు పెడితే అసలు పట్టించుకోవడం లేదని ప్రతి పోలీస్ స్టేషన్, పాఠశాలలు, కార్యాలయాల్లో చక్రాల కుర్చీలు, ర్యాంపు సౌకర్యం ఉండేవిధంగా చూడాలని కోరారు.  దివ్యంగులకు అంత్యోదయ కార్డులు, సంక్షేమ శాఖల నుండి ఇచ్చే సబ్సిడీ ఋణాల్లో దివ్యంగుల కోటా ప్రకారం వారికి మంజూరు చేయాలని ఆదనవు కలెక్టర్ ను కోరారు.  మండలాల్లో ఏ.పి.యం ల ద్వారా, అంగన్వాడీ టీచర్ల ద్వారా సేవలు అందేవిధంగా ఆదేశించాలని కోరారు. 2016 వికలాంగుల చట్టం పకడ్బందీగా అమలు అయ్యేవిధంగా చూడాలని అదనపు కలెక్టర్ ను కోరారు. ఇందుకు స్పందించిన అదనపు కలెక్టర్ ఈ నెల 23వ తేదీన నాగర్ కర్నూల్ పట్టణంలో దివ్యంగుల కు ప్రత్యేకంగా బస్ పాస్ మేళా నిర్వహించి అర్హులైన వారందరికీ ఉచిత బస్ పాస్ లు ఇచ్చే విధంగా చర్యలు రీసుకోవాలని డిపో మేనేజర్ ను అదేశించగా అందుకు అంగీకరించిన డిపో మేనేజర్ తగిన చర్యలు తీసుకొని బస్ పాస్ మేళా నిర్వహిస్తామన్నారు.  దివ్యంగులకు  సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో వారికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం రుణాలు ఇచ్చేవిధంగా బ్యాంకర్లకు ఆదేశించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.  అంత్యోదయ కార్డులు పొందేందుకు మీసేవా లో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకొవాలని సూచిస్తూ  సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకొని దివ్యంగులకు మండలానికి 5 చొప్పున అంత్యోదయ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు.  దివ్యంగులు, వృద్ధుల కు సహాయం చేసేందుకు జిల్లా నుండి కె. పవన్ కుమార్ రెడ్డి అనే ఎఫ్.ఆర్.ఓ ను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని దివ్యంగులు తమ సమస్యలు చెప్పుకోడానికి 18005728980 హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే పవన్ కుమార్ రెడ్డి కి సమాచారం వస్తూందని అతను బాధితులతో ఫోన్ ద్వారా కానీ, స్వయంగా వచ్చి సమస్యలు తేలుసుకొని పరిష్కరిస్తాడాని వారిని స్టేజి పై పరిచయం చేయించారు. అదేవిధంగా వృద్ధులకు వారి పిల్లల నుండి ఇబ్బందులు వస్తే 14567 టోల్ ఫ్రీ నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే పవన్ కుమార్ రెడ్డి ఆర్డీఓ లేదా ఇతర అధికారులతో మాట్లాడి న్యాయం చేయిస్తాడాని తెలిపారు. ఈ సదుపాయాన్ని దివ్యంగులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  మహిళల పై అత్యాచారాలు విషయంలో ఆదనవు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళల కమిటీ ఒకటి తప్పని సరిగా ఏర్పాటు చేయాలని కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగితే కమిటీ ద్వారా ఉన్నతాధికారులు  బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  గర్భిణి మహిళలకు ఎప్పటికప్పుడు వైద్య శాఖ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి సరైన రిపోర్టులు ఇచ్చి రక్తహీనత లేకుండా సుఖ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. పెళ్లి కాకుండా పిల్లలు కనడం లేదా పుట్టిన బిడ్డ వద్దు అనుకునే వారి కోసం జిల్లాలోని 5 కమ్యూనిటీ హెల్త్గ్ సెంటర్లలో పిల్లలకు  ఉయ్యాలలు పెట్టి ఉంచడం జరిగిందని ఆ పిల్లలను ఆ ఉయ్యాలలో వేసి వెళ్లిపోవచ్చని అలాంటి పిల్లలను శిశు సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది బాగోగులు చూసుకుంటుందని తెలియజేసారు.     మహిళలు గృహ హింసకు గురి అయితే వారిని సహాయం చేసేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్ జిల్లాలో విజయవంతంగా పనిచేస్తుందని  181 హెల్ప్ లైన్ ద్వారా మహిళలు సహాయం పొందవచ్చన్నారు.  అన్ని శాఖల సమన్వయం తో పని చేసి మహిళలు, పిల్లలు, దివ్యంగులు, వృద్ధులకు బాసటగా నిలవాలని ఆదేశించారు.
         ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిడిపిఓ లు, సూపర్వైజర్లు, దివ్యంగుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, నిరంజన్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు