సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
రైతుబంధు కోసం ప్రత్యేకం
మెదక్,మే8(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 10 నుంచి కొత్త పట్టేదారు పాసు పుస్తకాలు, పెట్టుబడి సహాయం కింద రైతులకు చెక్కులు అందించేందుకు చర్యలు చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, ప్రజాప్రతినిధులు కలిసి రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలుమార్లు సవిూక్ష నిర్వహించారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సి చర్యలపై సూచనలు చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి
ఆధ్వర్యంలో రైతు బంధు పథకం కింద జిల్లాలో 20 మండలాల్లో, 320 గ్రామ పంచాయతీలను కలుపుకొని 391 రెవెన్యూ గ్రామాలు ఉండగా 390 గ్రామాల్లో రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కులు, పాస్ బుక్కులు అందివ్వనున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక రెవెన్యూ గ్రామం మినహా అన్ని గ్రామాల్లో ఈ నెల 10 నుంచి 17 తేదీ వరకు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులు అందజేసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు రైతు బంధు పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో 1లక్ష 87 వేల మంది రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందించనున్నారు. అటవీ హక్కు పత్రాలు కలిగి ఉన్న గిరిజన రైతులు, అటవీశాఖకు చెందిన భూమి రెవెన్యూ పట్టాలు కలిగి ఉన్న 1359 మంది రైతులకు 46 లక్షల 34 వేల రూపాయలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఈ చివరి జాబితాను రెవెన్యూ యంత్రాంగం తయారు చేస్తోంది. రైతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. ప్రత్యేకంగా వీఆర్వో ఆధ్వర్యంలో ఫిర్యాదుల విభాగం(గ్రీవెన్‌సెల్) ఏర్పాటు చేసి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు చేసినట్లు జేసీ నగేశ్ తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7: 30 వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వీఆర్వోలతో గ్రామాల్లో గ్రీవెన్‌సెల్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడానికి సైతం ఏర్పాట్లు చేసింది.