సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి తీసిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులు పంపిన లేఖ ఆఫ్జల్‌ కుటుంబానికి చేరడంపై పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రధాని… హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను ఈ విషయంపై వివరణ కోరారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్ల సమావేశం సందర్భంగా షిండేతో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఉరిశిక్ష అమలు విషయంలో అవసరమైన ప్రక్రియను ఎందుకు పాటించలేదని.. సమాచారాన్ని ముందుగా కుటుంబసభ్యులకు ఎందుకు తెలియజేయలేదని అడిగినట్లు సమాచారం. అఫ్జల్‌గురుకు శనివారం తీహార్‌ జైల్లో ఉరిశిక్ష అమలు చేసి అక్కడే మృతదేమాన్ని ఖననం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉరితీసిన రెండు రోజుల అనంతరం జైలు అధికారులు పంపిన లేఖ అతని కుటుంబసభ్యులకు చేరింది.