సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

3
– లోటుపాట్లను ఎత్తి చూపండి

– సంచలనాల కోసం పాకులాడొద్దు

– గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి):సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరుగుతున్న ప్రెస్‌ క్లబ్‌ స్వర్ణోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఏ రంగంలోనైనా లోటుపాట్లు ఉంటే మీడియా ఎత్తి చూపాలే తప్ప సంచలనాల కోసం పాకులాడరాదన్నారు. మీడియా బాధ్యతాయుతంగా ఉంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. విమర్శలు మంచివే గానీ… అవి నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. విూడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి విూడియా ప్రతి విషయాన్ని బ్రేకింగ్‌ న్యూస్‌ తో సెన్సెషన్‌ చేయడం సరికాదని గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి విూడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.  విూడియా నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలను గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విమర్శ కోసం విమర్శ చేయడం సరికాదని గవర్నర్‌ నరసింహన్‌ హితవు చెప్పారు. విమర్శలతో పాటు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పారు. ప్రతి విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసి వార్తలు, విశ్లేషణలు ఇస్తే బాగుంటుందని సూచించారు. జాతీయ ప్రాధాన్యత విషయంలో ఎవరూ రాజీ పడొద్దని గవర్నర్‌ స్పష్టం చేశారు. 26/11, కాందహార్‌ హైజాక్‌ వంటి సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తదితరులు పాల్గొన్నారు.

చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్‌ విూడియా:బండారు దత్తాత్రేయ

ఎలక్ట్రానిక్‌ విూడియాను కూడా చట్టం పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. పీఎఫ్‌ పరిధిలో ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు కట్టించేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. జర్నలిజం గౌరవప్రదమైన వృత్తి అని దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ చారిత్రాత్మకమైనదని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్‌ క్లబ్‌ కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందుంది:మంత్రి కేటీఆర్‌

జర్నలిస్టుల సంక్షేమం విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటికే రూ. 10 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ లో జర్నలిస్ట్‌ భవన్‌ ను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో జర్నలిస్టులకు కోటా కల్పిస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల కేటాయింపునకు సంబంధించి గతంలో ఉన్న జీవోలను పకడ్బందీగా అమలు చేస్తామని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.  ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ప్రజాకవి కాళోజీ చెప్పిన సూక్తిని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమాజానికి మంచిని చేరవేసే సాధనంగా విూడియా వ్యవహరించాలని సూచించారు. విూడియాకు సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉందని, ఆ గౌరవ స్థానాన్ని విూడియా కాపాడుకోవాలని చెప్పారు. ఆవేశకావేశాల్లో రాజకీయ నాయకులు మాటలు తూలినా.. విూడియా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. రవి, కవి గాంచని చోట కూడా జర్నలిస్ట్‌ చూడగలడని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. ఇప్పటి వరకు విశేష సేవలందించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.