సమైక్యంలో నష్టపోయాం
గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి : విప్
యాదాద్రి భువనగిరి,జూన్25(జనం సాక్షి ): ముఖ్యమంత్రి కెసిఆర్ సదాశయంతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో తెలంగాణను మాంసం ఎగుమతి చేసే స్థాయికి తీసుకుని రావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గొర్రెలతోనే గొల్ల, కుర్మల వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశించి సిఎం కెసిఆర్ వందల కోట్లు సబ్సిడీతో పథకం అమలు చేస్తున్నారని అన్నారు. దీనిని విూరంతా కష్టపడి సాధించాలని ఆమె వారికి ఉద్బోధించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో గొర్రెల యూనిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోయిందో సీఎం కేసీఆర్ ఆలోచన చేశారనీ, అప్పుడే గొర్రెల పంపిణీపై చర్చించారని వివరించారు. తెలంగాణలో ప్రజలకు సరిపడా మాంసం దొరకడం లేదనీ, హైదరాబాద్‌కు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ నుంచి రోజుకు 500 లారీల్లో మాంసం దిగుమతి అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులు పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తుందనీ, గొల్ల కుర్మలది గౌరవ ప్రదమైన వృత్తి అనీ, వృత్తి నైపుణ్యం ఉన్న కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ప్రతి మనిషి సగటున ఎన్ని గ్రాముల మాంసం తీసుకోవాలనేది వైద్యులు నిర్థారించే రోజులు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో సగటు మనిషికి సరిపడా మాంసం కంటే రెట్టింపు ఉత్పత్తుతులను రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కులవృత్తుల సంక్షేమం కోసం పాటుపడితే ,కులవృత్తులు చేసుకొని ప్రజలు బతకాలా అంటూ ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.