సమైక్యత దినోత్సవాలను దిగ్విజయం చేయాలి.
జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు.
16 న ప్రేమ్ నగర్ నుండి డిగ్రీ కళాశాల వరకు 15,000 మందితో ర్యాలీ.
17న ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావుచే కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ.
18న రామప్పలో ముగింపు ఉత్సవాలు..
18న రామప్పలో ముగింపు ఉత్సవాలు
పాల్గొననున్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,
సంగీత వాయిద్య కళాకారుడు శివమణి, సినీ నటులు తనికెళ్ల భరణి :: జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.
ములుగు బ్యూరో,సెప్టెంబర్15(జనం సాక్షి):-
తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ములుగు జిల్లాలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు.
జిల్లాలో వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 16న ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ వద్ద నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు 15వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిగ్రీ కళాశాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరికీ భోజన సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
17వ తేదీన జిల్లా కలెక్టరేట్లో వజ్రోత్సవ వేడుకల ముఖ్య అతిథి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు చే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.చివరి రోజు ఈ నెల 18 ఆదివారం వజ్రోత్సవ ముగింపు వేడుకలను వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రాంగణంలో సాయంత్రం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.ముగింపు ఉత్సవాలలో లేజర్ షో తో పాటు రామప్ప వైభవంతో పాటు ములుగు జిల్లాలపై చిత్రీకరించిన ప్రత్యేక ఆడియో విజువల్ ను ప్రదర్శించడంతోపాటు ప్రముఖ సంగీత వాయిద్య కారుడు శివమణి,సినీ నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకులు విశ్వ చే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు జిల్లాలోని ప్రజలు ప్రజాప్రతినిధులు,అధికారులు,వి ద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి…
రాష్ట్రంలో చివరిగా ఏర్పడిన ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల దూరంలో అన్ని కార్యాలయాల భవనాలు నిర్మింప చేసేందుకు స్థల సేకరణ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన మెడికల్ కళాశాల తో పాటు సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించమని అన్నారు. ఈ నెలాఖరు వరకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులచే ప్రారంభిస్తామని తెలిపారు. బండారుపల్లి శివారులో మినీ స్టేడియం నిర్మాణంతో పాటు ఆర్టీవో కార్యాలయం, ఇంటెలిజెన్స్ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓగులాపూర్ లో నడుస్తున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. ములుగు మండలం ఇంచర్ల ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం స్థలాన్ని కేటాయించమన్నారు. అదేవిధంగా ఇంచర్ల సమీపంలో సెరికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో మాడల్ టూరిజం విలేజ్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన గోదాములో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి మరో రహదారిని రామప్ప నుండి నరసాపూర్ మీదుగా నిర్మిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఘటమ్మ దేవాలయం నుండి మహమ్మద్ గౌస్ పల్లి వరకు జాతీయ రహదారి పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బ్రాహ్మణపల్లి, ఏటూరు నాగారం, జవహర్ నగర్ టోల్ ప్లాజా వద్ద చెక్పోస్టులను సైతం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు వాహనాల రాకపోకలను గుర్తించేందుకు జవహర్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఆటోమేటెడ్ సెన్సార్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈనెల 19వ తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన వాలంటీర్లు పాల్గొని రామప్ప విశిష్టతను తెలుసుకొని ఆయా ప్రాంతాలలో రామప్ప విశిష్టతపై ప్రచారం నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్ తో పాటు డిపిఆర్ఓ యం.డి.రఫిక్ పాల్గొన్నారు.