సరిహద్దు జిల్లాల్లో టెండర్లకు వ్యాపారుల దూరం
మహారాష్ట్ర మద్యంతో లాభసాటి వ్యాపారం
ఆసిఫాబాద్,అక్టోబర్26 (జనంసాక్షి ) : జిల్లాలో జనాభా ప్రాతి పదికన మద్యం దుకాణాలను కేటాంచగా 15మండలాలకు గాను 26మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. ఇందులో ఆసిఫాబాద్ డివిజన్‌లో 13, కాగజ్‌నగర్ డివిజన్‌లో 13 మద్యం దుకాణాలున్నాయి. కాగా క్రితంసారి ఏజెన్సీ ప్రాంతంలో ఆది వాసీ సంఘాల వ్యతిరేకత కారణంగా జైనూరు, సిర్పూరు(యూ), లింగాపూర్ మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు మార్చారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి ఆదివాసీ సంఘాలే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మరో మూడు మద్యం దుకాణాలను అదనంగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కొత్త లైసెన్సింగ్ పాలసీలో జిల్లాలో మొత్తం 29 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే పరిస్థితులుండొచ్చని చెబుతున్నారు.
ఎక్సైజ్ దృష్టి అంతా కూడా సరిహద్దు దుకాణాలపైన్నే కేంద్రీకృతం చేసి అంకెలతో కుస్తీ పడేది. ఇదంతా ఒకప్పటి మాట. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ జరుగుతున్న విషయాన్ని గుర్తించి చంద్రాపూర్ జిల్లాలో నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు లోని వాంకిడి, కెరమెరి, సిర్పూరు(టి), కౌటాల మద్యం దుకాణా లకు టెండరు వేసేందుకు వ్యాపారులు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరీ ముఖ్యంగా వాంకిడిలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లిన మద్యం దందాతో క్రితం సారి ఎక్సైజ్‌శాఖ అదనంగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2020లో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రాపూర్ జిల్లాలో మద్యనిషేధాన్ని ఎత్తివేసి మద్యం విక్రయాలు ప్రారంభించింది. దీంతో తెలంగాణ వైపు నుంచి మద్యం రవాణా కాకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఫలితంగా లాభాలపై ఆశతో దుకాణాలను చేజించుకున్న వ్యాపారులు లైసెన్సు ఫీజు కూడా చెల్లించ లేని పరిస్థితికి దిగజారిపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించ బోయే నూతన మద్యం విధానంలో వాంకిడి నుంచి ఒక దుకాణం రద్దు చేసి ఆసిఫాబాద్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఒక మద్యం దుకాణం నడవటం కష్టమేనని చెబుతున్నా పాత వ్యాపారులే మళ్లీ అక్కడే టెండర్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనించాల్సిన విషయం.