సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బావి తరాలకు స్ఫూర్తి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

*జిల్లా కేంద్రం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి తెలంగాణ ప్రాంతాన్ని 17 వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాక తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు .జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాధిత్య భవన్ లో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి ఉత్సవాలు కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొ న్నారు.ముందు గా మంత్రి జగదీశ్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ,పలువురు బి.సి.సంఘాల నాయకులు తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా గా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,కొమురం భీం,చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధుల చరిత్రను ఆనాటి పాలకులు విస్మరించారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పోరాట యోధులను గౌరవించు కుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. భావితరాలకు పోరాట స్పూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘన కీర్తిని సొంతం చేసుకున్నాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి యోధులు ఒక వర్గానికి పరిమితం కాదని, మొగలుల దోపిడీ నుండి స్వేచ్చా లభించాలని పోరాటం చేసిన పాపన్న గౌడ్ అందరి వాడని అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే.. అదే చరిత్ర పుటల్లో ఇంకొంతమంది అమరవీరుల త్యాగాలకు సముచిత స్థానం దక్కకపోవడం. అలాంటి వారిలో ప్రథముడే సర్దార్ సర్వాయి పాపన్న అని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు. రాచరికపు వ్యవస్థలో శిస్తు కట్టించుకుని అణిచేయడమే తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియని చీకటి రోజుల్లో అట్టడుగువర్గాల బానిస బతుకుల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న అన్నారు మొగల్ సామ్రాజ్యంలో ప్రభువుల అండదండలు చూసుకుని అరాచకాలకు పాల్పడుతున్న జమీందార్లు, జాగీర్దార్ల పెత్తనానికి ఫుల్‌స్టాప్ పెట్టిన ఘనుడాయన. ఆత్మాభిమానం కోసం, అట్టడుగువర్గాల మనుగడ కోసం తనకు తెలియకుండానే కత్తి పట్టిన సర్దార్ సర్వాయి పాపన్న ఆ తర్వాత చరిత్రనే తిరగరాశాడని మంత్రి అన్నారు.
ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్​ సర్దార్ సర్వాయి పాపన్న సొంత గ్రామం. గౌడ కులంలో పుట్టిన పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సర్వమ్మే అన్నీ తానై అతడిని పెంచి పెద్దచేసింది. చిన్నతనం నుండే జమీందార్లు, దొరల అరాచకాలను చూస్తూ పెరిగిన సర్వాయి పాపన్నలో సహజంగానే రాచరికపు వ్యవస్థపై వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. తల్లి కోరిక మేరకు గౌడ కుల వృత్తిని చేపట్టిన సర్వాయి పాపన్నకు.. దొరల చేతుల్లో, మొగల్ సామ్రాజ్య సైనికుల చేతిలో ఎదుర్కొన్న అవమానాలు వారిపై ఉన్న వ్యతిరేకభావాన్ని మరింత పెరిగేలా చేశాయని అన్నారు
ఈ క్రమంలోనే అట్టడుగువర్గాలకు కనీసం దరికి చేరనివ్వని అగ్రవర్ణాల పెత్తనాన్ని అడ్డుకోవాలంటే తనకు బహుజనుల మద్దతు ఎంతైనా అవసరం అని భావించిన సర్వాయి పాపన్న.. తన స్నేహితులు,ప్రజలలో, కలిసి తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి వివరించి వారిలో చైతన్యం రగిల్చాడు.
రాచరికపు నేపథ్యం లేకుండానే, రాజుల అండదండలు లేకుండానే.,అతి సామాన్యుడైన సర్వాయి పాపన్న తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే తయారు చేసుకున్నాడని, అంతకంటే ముందుగా పేద ప్రజలను పందికొక్కుల్లా దోచుకుతింటున్న జమీందార్లు, దొరలు, బడాబడా భూస్వాములను తన సైన్యంతో వెళ్లి దాడి చేసి దోచుకోవడం మొదలుపెట్టాడు. అలా దోచుకున్న ధనాన్ని అవసరం ఉన్న చోట పేదలకు పంచిపెడుతూనే రాజుల తరహాలో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన వెంట ఉన్న బహుజన సైన్యానికి ఆయధాల శిక్షణ ఇచ్చాడు. రాజ కుటుంబంలో పుట్టకపోయినా.. రాజనీతిజ్ఞిని ప్రదర్శిస్తూ పేదోళ్లకు రాజయ్యాడు.. అరాచక శక్తులకు సింహస్వప్నమయ్యాడను అన్నారు.తెలంగాణ లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టీ పోరాటాలు చేసిన యోధుల త్యాగాలను, వారి చరిత్రను భావి తరాలకు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.అర్.గుర్తించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజల కోసం పోరాటం చేసిన వారు వారి గుండెల్లో చిర స్తాయిగా నిలిచి పోతారని అన్నారు.గౌడ సంఘాల నాయకులు కోరినట్టు నల్గొండ కు చెందిన ధర్మ బిక్షం,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శాలు,ఆశయాలను ఆచరించి ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు .సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్తలం కూడా గుర్తించడం జరిగిందని,అందరి తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గౌడ,బహుజనులు,అన్ని వర్గాలను కలుపుకొని ఆనాటి పాలకుల పెత్తనం పై పోరాటాలకు నాంది పలికారని అన్నారు ప్రభుత్వ పరంగా 372 వ జయంతి జరుపుకోవడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమం లో వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారిణి పుష్ప లత,మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, గౌడ సంఘాల నాయకులు సత్తయ్య గౌడ్, మాదగొని శ్రీనివాస్ గౌడ్,శంకర్ గౌడ్,బిక్షం గౌడ్,విశ్రాంత ఐ. ఏ.ఎస్.అధికారి చోల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

 

తాజావార్తలు