సలాం ముంబయి

 
హైదరాబాద్‌: దేశ రాజధాని దిల్లీ అయితే వాణిజ్య రాజధానిగా వాసికెక్కింది మాత్రం ముంబయి మహా నగరం. నిత్యం కొన్నివేల మంది ప్రజలు ఉదర, కుటుంబ పోషణ కోసం ఇక్కడికొస్తుంటారు. ప్రపంచ స్థాయి భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలకు ఇది నెలవు. భూమండలంపై ఉన్న సమస్త దేశాల్లో శరవేగంగా వృద్ధి సాధిస్తూ ఒకప్పటి ‘విశ్వగురు’ స్థానాన్ని మళ్లీ తిరిగి నిలబెట్టుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న భారతదేశ స్థూల ఆర్థిక ఉత్పత్తి (జీడీపీ)లో ముంబయి వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం కద్దు. ఆర్థికంలో అదుర్స్‌
ప్రపంచంలో అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో భారత్‌ది 8వ స్థానం. డిసెంబర్‌ 2015 నాటి లెక్కల ప్రకారం ఇది 2073.54 బిలియన్‌ డాలర్లు. ఇందులో ఒక్క ముంబయి నగరం వాటానే 278 బిలియన్‌ డాలర్లు. అంటే మొత్తం జీడీపీలో దాదాపు 7%. 30% ఆదాయపుపన్ను రాబడి, 60% కస్టమ్స్‌ సుంకం, 20% కేంద్ర ఎక్సైజ్‌ పన్ను వసూళ్లు, 40% విదేశీ వాణిజ్యం, రూ.40,000 కోట్ల కార్పొరేట్‌ పన్నులు ఇక్కడి నుంచే లభిస్తాయి.
పాకిస్థాన్‌ దిగదుడుపే
ముంబయి అందిస్తున్న జీడీపీ 278 బి.డాతో పోలిస్తే ప్రపంచంలోని చాలా పెద్ద దేశాలు దిగదుడుపే కావడం గమనార్హం. దాయాది పాకిస్థాన్‌ (269 బి.డా), చిలీ (240), పోర్చుగల్‌ (198), గ్రీస్‌ (193), బంగ్లాదేశ్‌ (195), వియత్నాం (193), పెరూ (192), న్యూజిలాండ్‌ (173), కువైట్‌ (112), శ్రీలంక (82), మయన్మార్‌ (64), పనామా (52), నేపాల్‌ (20), మారిషస్‌ (11.51 బి.డా) దేశాలదీ తక్కువే. ప్రపంచంలోని దాదాపు వంద దేశాల జీడీపీ ముంబయి కన్నా తక్కువ ఉండటం గమనార్హం.

 

88