సహకార రుణాలు సకాలంలో చెల్లించాలి

రంగారెడ్డి,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
:  తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సహకార వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కేంద్ర సహకార చైర్మన్‌ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రైతుల నుంచి డిసీసీబీకి రూ.320 కోట్ల రుణాలు రావాల్సి ఉన్నాయని చెప్పారు. రూ. 164 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయని 25 శాతంలో భాగంగా ఇప్పటి వరకు రూ. 40 కోట్లు రుణంగా అందజేసినట్లు తెలిపారు. ఇచ్చిన రుణాల్లో కనీసం 50 శాతం వసూలు చేసి రిజర్వు బ్యాంకుకు చెల్లిస్తేనే రుణ అర్హత పొందుతామన్నారు. ఈ విషయంలో పాలకవర్గ సభ్యులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఈవో రాందాస్‌, పరిగి సొసైటీ చైర్మన్‌ శ్యాం సుందర్‌రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ జనార్థన్‌రెడ్డి, సహకార సంఘం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.