సహాయక చర్యలపై అధికారుల సమీక్ష
హైదరాబాద్: జంట నగరాల పరిధిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు సమీక్ష నిర్వహించాయి. వర్షాల కారణంగా 3,600 కుటుంబాలపై ప్రభావం పడిందని ఆయా శాఖలు తేల్చాయి. వీటిలో 2వేల కుటుంబాలకు ఇప్పటికే సహాయం అందించగా… మిగతా కుటుండాలకు నిత్యావసరాలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 23ఇళ్లు కూలిపోగా, వీటిలో రెండు చోట్ల 9మంది మృతి చెందారు. బాధితులను భోజగుట్ట, గోల్కొండలో ఏర్పాటుచేసిన రెండు పునరావస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. వర్షాల భారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున జీహెచ్‌ఎంసీ పరిహారం ప్రకటించింది. ఇళ్లు కోల్పోయిన వారికి కుటుంబానికి ఐదు కిలలో బియ్యం, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రెండు కిలోల బియ్యం చొప్పున పంపిణీచేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.