సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన
ముందస్తుగా అపరాల సాగుకు ప్రోత్సాహం
విజయవాడ,జూన్2(జనం సాక్షి): రాష్ట్ర విభజన అనంతరం సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ ప్రాంత రైతులకు నీరందడం లేదన్న ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లాలో గత మూడేళ్లుగా నిర్ణీత నీటి వాటాలో సగం కూడా రాలేదు. ఎడమ కాలువ పరిధిలో జిల్లా ఉంది. సాగర్ జలాలు గత రెండేళ్లలో గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌కు ఇచ్చింది లేదు. కనీసం రబీకి సరిగా ఇవ్వలేదు.ఆరుతడి పంటలకు రెండు, మూడు తడులకు మించి ఇచ్చింది లేదు. ఖమ్మం జిల్లా వరకే నీరు వస్తోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తొలకరి ప్రారంభం కాగానే రైతులు అపరాలను సాగు చేసుకోనున్నారు. ఈ విత్తనాలను అధికారులు రాయితీపై అందించనున్నారు. దీనికి తోడు వీటికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. పంట వేసేటప్పుడు భూమి తడిస్తే చాలు.. ఆ తర్వాత తడులు లేకపోయినా ఇబ్బంది లేదు. చెరువులు, బోర్ల కింద కొద్దిగా నీరున్నా సరిపోతుంది. కేవలం 60 నుంచి 70 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. సాగర్‌కు నీరు వచ్చేలోగా ఓ పంట దక్కుతుంది. గత ఏడాది రబీలో వేసిన మినుము, పెసర పంటలకు మొవ్వకుళ్లు తెగులు ఆశించడంతో రెండు జిల్లాల్లోని అన్నదాతలు భారీగా నష్టపోయారు. దీంతో ఈ సారైనా పంటను దక్కించుకునేందుకు రైతాంగం కోటి ఆశలతో సన్నద్ధం అవుతోంది.కృష్ణా జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో గన్నవరం నుంచి తిరువూరు వరకు, ఉంగుటూరు, ఉయ్యూరు, పమిడిముక్కల, తదితర ప్రాంతాల్లోని 36 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. 33 శాతం రాయితీపై మినుము, పెసర విత్తనాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. వీటిని సంబంధిత మండల కేంద్రాలకు పంపించారు. గుంటూరు జిల్లాలోని గురజాల, నరసరావుపేట డివిజన్లలోని లక్ష ఎకరాల్లో సాగు చేయనున్నారు. అక్టోబరు, నవంబరులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉంటాయి. మెట్ట ప్రాంతాల్లో ఆ సమయంలోనే సాగర్ నీటిని వదులుతారు. ఆ సమయంలోనే పంటలు వేస్తారు. దీని వల్ల అవి మునిగిపోతున్నాయి. ఈలోపే ఒక్క పంట అయినా వేస్తే అది రైతులకు అక్కరకు వస్తుంది. రెండు జిల్లాల్లో ముందస్తు ఖరీఫ్ సాగుకు సంబంధించి అన్ని గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది గుంటూరులో ఈ విధానం బాగా విజయవంతం అయింది. రైతులు 50 వేల ఎకరాల్లో అపరాలు సాగు చేసి మంచి ఆదాయం పొందారు. దీంతో ఈ సీజన్‌లో జిల్లాలో విస్తీర్ణం రెట్టింపు అయింది. ఈ పంటలపై రైతులు పెద్దగా పెట్టుబడిపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పంట చీడపీడలు ఆశించి విఫలమైతే.. దాన్ని పొలంలోనే కలియదున్నేస్తారు. ఈ పంటను సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. దీని వల్ల భూమిలో పోషకాలు పెరుగుతాయి. తర్వాత వేసే పంటలకు ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈంతో అపరాల సాగుకు రైతులు కూడా ముందుకు వస్తున్నారు.