సాగర్ లెఫ్ట్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
– మంత్రి హరీష్ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్,జూన్22(జనంసాక్షి):
నాగార్జునసాగర్ కాల్వ పనులపై మంత్రి హరీష్‌రావు సవిూక్ష జరిపారు. జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాల్వ పనులను త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఇదిలావుంటే ఇటీవల నల్లగొండ, ఖమ్మం జిల్లాల పర్యటలన సందర్భంగా మంత్రి వాస్తవ పరిస్థితులను గమనించారు. కాల్వలు అసంపూర్తిగా ఉన్న విసయాలను అధికారులతో చర్చించనట్లు సమాచారం.అలాగే తెలంగాణలో ఉన్న భారీ మరియు మధ్య తరహా ప్రాజెక్టుల కు చెందిన క్వార్టర్లలో గృహ విద్యుత్ పంపిణీ విధానం పై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్కమ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సవిూక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ ఫ్లాంక్ కాలనీ, ఏ.యం.ఆర్.యస్.యల్.బి.సి. ప్రాజెక్టులకు చెందిన నివాస క్యాంపుల గృహ విద్యుత్ పంపిణీ విధానం మార్పు గురించి ఈ సమావేశం ప్రధానంగా చర్చించింది. హై టెన్షన్ విద్యుత్ వాడకం ద్వారా ప్రభుత్వానికి గత 40 సంవత్సరాలుగ తీవ్ర నష్టం జరుగుతున్నది కాబట్టి వాటిని లో టెన్షన్ విద్యుత్ లోకి మార్చి సరఫరా చేయాలని టి.యస్.యస్.పి.డి.సి.యల్. ఉన్నతాధికారులను ఈ సమావేశం సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీచేశారు. ప్రతి గృహానికి ప్రత్యేక విూటర్లు బిగించి బిల్లులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ కు ఇరిగేషన్ శాఖ (క్యాంప్ కాలనీలు) బకాయి పడ్డ 38.8 కోట్ల రూపాయలను సత్వరమే చెల్లించే విధంగా మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పక్రియను వారం రోజులలోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ , విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు కదలాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో ఆలస్యాన్ని సహించేది లేదని అన్నారు. క్యాంప్ కాలనీలలో ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్లను టి. యస్. యస్. పి. డి.సి.యల్. కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పంపిణీ విధానం మార్పు చేసే క్రమంలో నాగార్జునసాగర్ క్యాంప్ లో ఎలాంటి డెవలప్ మెంట్ చార్జీలను విధించరాదని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు 5066 వినియోగదారులు క్యాంప్ కాలనీలో ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. నూతన వినియోగదారులకు మాత్రం టి. యస్. యస్. పి. డి.సి.యల్. నిభందనల ప్రకారం డెవలప్ మెంట్ ఛార్జీలు సెక్యూరిటి డిపాసిట్, సర్వీస్ లైన్ ఛార్జీలు వర్తిస్తాయి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే మిర్యాలగూడ, టేకులపల్లి కాంప్ క్వార్టర్లకు మాత్రం యధావిధిగా కనెక్షన్, డెవలప్ మెంట్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ క్యాంప్ కాలనీ
కోసం నిర్మించ తలపెట్టిన 33/11 ఐదు సబ్ స్టేషన్ కు స్థల సేకరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీశైలం లెఫ్ట్ ఫ్లాంక్ కాలనీ, ఏ.యం.ఆర్.యస్.యల్.బి.సి. క్యాంప్ కాలనీ కి చెందిన గుర్రంపోడు, కనగల్, జి. వి. గూడెం, పనగల్, తిప్పర్తి, కుక్కడం, నకిరేకల్, ఐటిపాముల, మరియు గుడిపల్లి అలాగే యన్. యస్. పి. క్యాంప్ కాలనీలైన మిర్యాలగూడ, నేరేడుచెర్ల, కోదాడ లలో ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖకు సెక్యూరిటి డిపాసీట్లను చెల్లించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇప్పటివరకున్న పాత బకాయిలను చెల్లించిన వెంటనే ఇప్పటివరకు కొనసాగుతున్న హెచ్.టి. విద్యుత్ పంపిణీ ని యల్.టి. కి మార్చాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇదే విధానాన్ని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఎల్.ఏం.డి. ఇతర మేజర్, విూడియం ప్రాజెక్టుల కాంప్ క్వార్టర్లకు వర్తింపచేయడానికి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.