సాగర్ ఎడమ కాలువ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి
కాలువ గట్టుకు కాకుండా మధ్యలో బుంగ పడింది
అధికారుల అప్రమత్తతోనే ప్రమాదం తప్పింది
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కాలువలో నీరు నిండుగా ఉండటానికి తోడు నీటి మధ్యలో బుంగ పడటంతోనే సాగర్ ఎడమ కాలువ ప్రమాదాన్ని గుర్తించలేక పోయామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద నిన్న సాయంత్రం సాగర్ ఎడమ కాలువ పడిన గండిపై స్పందించారు.కాలువ కట్ట పునర్ నిర్మాణ పనులు ప్రారంభ మయ్యాయని తెలిపారు.మరో ఐదు ఆరు రోజుల్లో తిరిగి ఎడమ కాల్వలో నీటిని పునరుద్ధరిస్తామన్నారు.గండి పడిన ఐదు నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు గండి పడిన ప్రదేశానికి చేరుకోవడంతో పాటు నీటిని ఆపడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టారని చెప్పారు.కాలువ మధ్యలో బుంగ పడటంతోనే నీరు అధికంగా ఉన్న కారణంగా సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించలేక పోయారని అన్నారు.లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ద ప్రాతిపదికన బయటకు పంపగలిగమన్నారు.అకాల వరదతో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరుగలేదన్నారు.ఎవరైనా నష్టపోతే వారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారని తెలిపారు.నష్ట పోయిన వారు ఎవరైనా ఉంటే వారిని ఆదుకుంటామని అన్నారు.