సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత కెసిఆర్‌దే

విపక్షాలు విమర్శలు మానకుంటే పరాభవం తప్పదు

జిల్లాలో నిర్ణీత కాలంలో ప్రాజెక్టుల పూర్తి: మంత్రి తుమ్మల

ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): అత్యంత వెనుకబాటుకు గురైన పాలేరు నియోజకవర్గం పరిధిలోని దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం అయిన భక్తరామదాసు ప్రాజెక్టు తమ ప్రభుత్వం చేపట్టి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నిరూపించుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. సాగునీటి రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యాలను, లక్ష్యాలను ముఖ్యమంత్రి ప్రజలకు వివరిస్తూనే ఉన్నారనిమంత్రి చెప్పారు. పాలేరు ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా సిఎం కెసిఆర్‌ సాగునీటి ప్రాజెక్టులపై తన చిత్తశుద్దిని చాటారని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను ఇలాగే పూర్తిచేసి చూపుతామని అన్నారు. రైతుల కష్టాలు తనకు తెలుసునని సగంనీరు వచ్చినా నేలకొండపల్లిని, కల్లూరును, పాలేరును పండిస్తానని మంత్రి పేర్కొన్నారు. రైతులు బాధులు పడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం తమది కాదన్నారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో సాగునీటిప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు చేయని ప్రయత్నం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రాజెక్ట్‌లు నిర్వీర్యమయ్యాయన్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయపడ్డారన్నారు. ప్రభుత్వం సాగునీటి రంగంతో పాటుగా వ్యవసాయ రంగంలో సైతం విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో పాలీ హౌస్‌ వంటి సాగును సబ్సిడీలు ఇస్తు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆటంక పర్చకపోవడమే మంచిదని గుర్తించాలన్నారు. వరుస ఎన్నికల్లో పరాభవానికి గురవుతున్నామని, ప్రజలంతా ఏకపక్షంగా ఉన్నారని, వారి మనసుల్ని కలుషితం చేయాలని కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. కానీ ప్రజలు, రైతాంగం కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందించటంతో నిర్ణీత గడువుకు ముందే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న విపక్షాలు సాగునీటి ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా నదిపై వంద విూటర్లకో చెక్‌ డ్యాం నిర్మించుకున్న కారణంగా కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు గోదావరి నీటి అవసరాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాకు సైతం మూడు, నాలుగు సంవత్సరాలుగా సాగర్‌ జలాలు రాకపోవటంతో ముఖ్యమంత్రి, భారీ నీటిపారుదలశాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిని రప్పిస్తుంటే కొందరు దివాళాకోరు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణాబోర్డు తీర్పు ప్రకారమే నీటిని వాడుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రజల బాధలు, రైతుల కష్టాలను చూసిన తాను నీటిని తీసుకురావటం తప్పా అని ప్రశ్నించారు. శ్రీరంగ నీతులు చెబుతున్న నాయకులు గత 30 ఏండ్లలో సాగర్‌ జలాలను ఎందుకు తీసుకురాలేక పోయారో చెప్పాలన్నారు. నీరు అందించే బృహత్తర పథకాన్ని సీఏం కేసీఆర్‌ సహాకారంతో కేవలం 11నెలల్లోనే పూర్తి చేయగలిగామన్నారు. పాలేరు జలాశయం నుంచి క్రిష్ణా జలాలను శ్రీరాంసాగర్‌కాల్వల ద్వారా సరఫరా చేసేలా ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.