సాగు చట్టాలు రైతుల కోసం కాదు : అదానీ ఆస్తులు పెంచడానికి

ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధన లో వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనం సాక్షి):  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్‌ కూడా కీలక భూమిక పోషించింది. రైతులపై పరోక్షంగా పెత్తనం చెలాయించాలనుకోవడమే కాదు.. అన్నదాతల కష్టాన్ని పరోక్షంగా దోచుకోవాలనుకొన్నది. ఈ మేరకు ప్రముఖ జర్నలిస్ట్‌ ఫోరమ్‌ వెబ్‌సైట్‌ ‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ మరో పరిశోధనాత్మక పత్రంలో వెల్లడించింది.

నీతిఆయోగ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలో ఎలాంటి వ్యవసాయ అనుభవంలేని బీజేపీ సన్నిహితుడు, ఎన్నారై టెకీ శరద్‌ మరాఠే సభ్యుడుగా చేరినట్టే, మూడు నల్ల చట్టాల్లో తమకు అనుకూలమైన కొత్త నిబంధనలను చేర్చడంలో అదానీ గ్రూప్‌ కూడా కీలక పాత్ర పోషించింది. రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ కథనం ప్రకారం.. నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం.. దేశంలో ధాన్యం ధరలను నియంత్రించడానికి కేంద్రం కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. మార్కెట్లో వ్యాపార సంస్థలు మోతాదుకు మించి ధాన్యాన్ని నిల్వచేయకూడదని అందులో పేర్కొంది. అయితే, 2018 ఏప్రిల్‌లో అదానీ గ్రూప్‌ నీతిఆయోగ్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. ధాన్యం నిల్వలపై ఉన్న పరిమితుల ఆంక్షలను ఎత్తేయాలని కోరింది. దీంతో నిల్వలపై ఆంక్షలను ఎత్తేస్తున్నట్టు మూడు నల్లచట్టాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రం నిర్ణయం ముఖ్యంగా అదానీ గ్రూప్‌నకే లాభం చేకూర్చేలా ఉన్నదని రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా వేలాది గోదాములు, రైల్వే ర్యాక్‌లు, పోర్టులు అదానీ గ్రూప్‌నకు ఉండటమే దీనికి కారణంగా వెల్లడించింది. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొని, గోదాముల్లో నిల్వచేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి.. అప్పుడు ఆ ధాన్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించడానికే అదానీ గ్రూప్‌ నిల్వ నిబంధనలను ఎత్తివేయించిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగో పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఆ గ్రూప్‌ ఆధీనంలోనే ఉండటంతో.. అగ్గువసగ్గువకు కొనుగోలు చేసిన ఆ ధాన్యాన్ని అదానీ గ్రూప్‌ విదేశాలకు ఎక్కువ రేట్లకు ఎగుమతి చేయాలనుకొన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఏడాదిన్నరపాటు రైతన్నలు చేసిన నిరసనోద్యమంతో కేంద్రప్రభుత్వం దిగిరావడం.. నల్లచట్టాలను వెనక్కి తీసుకోవడంతో అదానీ పాచిక పారకుండా పోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.