సామాజిక తెలంగాణ కోసం పోరు: సిపిఎం
సంగారెడ్డి,నవంబర్30(జనంసాక్షి):సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం అన్నారు. . దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. జీఎస్‌టీ పేరుతో పేద ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. అలాగే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ విధానాలనే అవలంబిస్తూ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెరాల భూపంపిణీ, రైతుల రుణ మాఫీల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ చేతిలో కీలు బొమ్మగా మారి దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తోంటే బీజేపి ప్రభుత్వం సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.