సాయం కోసం అన్నదాతల ఎదరుచూపు
పంటనష్టపోయిన చోట్ల కొత్త పంటలకు యత్నాలు
మరీ దారుణంగా కౌలు రైతుల పరిస్థితి
ఆదిలాబాద్,జూలై23(జనంసాక్షి): గత మూడేళ్లుగా పెద్దవాగు, ప్రాణహిత నది పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట ముంపునకు గురై రైతులు నష్టపోయారు. నాడు నివేదికలతో పేరుతో హడావుడి చేసిన అధికార యంత్రాంగం పరిహారం మాత్రం అందించలేక పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఎటూ తేల్చక పోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరీముఖ్యంగా గతేడాది ఇదే తరహాలో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో పంటలు దెబ్బతినగా, పెద్దవాగు పరివాహక ప్రాంతంలోని దహెగాం, పెంచికల్‌పేట మండలాల్లో కూడా పంటలు ముంపు గురై రైతులు నష్టపోయారు. కేవలం విత్తన సహాయం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అప్పట్లో ప్రభుత్వం సహాయంపై రైతాంగం తీవ్ర ఒత్తిడి తేవటంతో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా కందులు, పెసర్ల వంటి విత్తనాలను రైతులకు ఉచితంగా అందించారు. అయితే ఈ దఫా ఆ విత్తనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. వరద నష్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తూతూ మంత్రంగా సవిూక్ష నిర్వహించి నష్టంపై ప్రాథమిక అంచనాలను తీసుకున్నారు. గతవారం రోజుల
నుంచి కురిసిన భారీవర్షాలు.. వరదల కారణంగా జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కారణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు. వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులులతో పాటు తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు నిర్దారించారు. జిల్లాలో అత్యధికంగా భైంసా డివిజన్‌లో పత్తిపంట నష్టపోయింది. అలాగే కడెం ప్రాజెక్టు కారణంగా వరితో పాటు మొక్కజొన్న, పసుపు పంటలు గల్లంతయ్యాయి. పంటలు కొట్టుకుపోవడమే కాకుండా పంట చేనులో పెద్దఎత్తున ఇసుకమేటలు వేయడంతో రైతులు మళ్లీ సాగుపనులు ఎప్పుడు మొదలవుతాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. 2 చెరువులకు వరదల కారణగా గండ్లు పడడమే కాకుండా కట్టలు కొట్టుకుపోవడం, వివిధ నష్టాలకు గురయ్యాయి. గతంలో అధికారులు రూపొందించిన నష్టం అంచనా ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోని సంగతి తెలిసిందే. నష్టపరిహారం అందించక పోవడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గతానికి భిన్నంగా ఈసారి పంటలకు ఆస్థులకు అత్యధికంగా నష్టం జరిగిన కారణంగా ఈసారి ఎలాగైనా పరిహారం అందించాలన్న డిమాండ్ అంతటా ఉధృతమవుతోంది. అప్పులు చేసి పె ట్టిన పెట్టుబడులన్ని వరదనీటిలో కొట్టుకుపోయాయని ఇప్పటికే తాము బ్యాంకు రుణాలు అందక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి పంటలు సాగుచేశామని రైతులు వాపోతున్నారు. రైతుబంధు కూడా ఆలస్యంగా పంపిణీ కావడం తమకు అవరోధ మైందంటున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం భిన్నంగా నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను వెంటనే ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రైతాంగం కోరుతోంది.