సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి!

మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలకోవ గ్రామానికి చెందిన గన్నా వెంకటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టును నరికాడు.

అది పూర్తిగా కింద పడకపోవడంతో గ్రామానికి చెందిన కొమర్రాజు నర్సయ్యను సాయం కోరాడు. చెట్టు కొమ్మలకు తాడు కట్టి ఇద్దరూ కలసి లాగుతుండగా అకస్మాత్తుగా ఆ చెట్టు వారిపై పడింది. దీంతో నర్సయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.