సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు సెప్టెంబరు 17న వచ్చిందని అన్నారు. ఆ చరిత్రను నాడు సీమాంధ్రులు నేడు కేసీఆర్‌ తొక్కేస్తున్నారని అన్నారు. మ¬త్తర పోరాటాన్ని స్మరిస్తూ విమోచనదినాన్ని అధికారికంగా చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన కేసీఆర్‌.. నేడు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని సీపీఐనేత పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలను తక్కువ చేసి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం స్ఫూర్తితో కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. దళితులకు మూడెకరాల భూమిని ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. హరితహారం పేరుతో పోడు సాగు రైతుల భూములను లాక్కుంటున్నారని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తిస్తూ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు నళినిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగాఇటీవల దనోర గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నాటి చారిత్రక పోరాటంలో 4500మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని పేర్కొన్నారు. నైజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రజలు స్వేచ్ఛవాయువులు పీల్చుకున్నారని గుర్తుచేశారు. నాటి పోరాటాన్ని గుర్తించి అధికారిక కార్యక్రమాలు

నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పునరుద్ఘాటించారు.