సారికది ఆత్మహత్య
హన్మకొండ నవంబర్ 07 (జనంసాక్షి):
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాధమికంగా
తేలుస్తున్నారు. తనతోపాటు పిల్లల్ని కూడా గదిలోకి తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. మాజీ ఎంపీ రాజయ్యతో పాటు కుమారుడు అనిల్‌కుమార్, భార్య మాధవి, అనిల్ రెండో భార్య సన పెట్టిన చిత్రహింసలు, శారీరక హింసల వల్ల జీవితం మీద విరక్తి చెంది ఆమె ఇలా చేసిందని పోలీసులు నిర్థరిస్తున్నారు. రాజయ్య కుటుంబాన్ని అరెస్టు చేశాక జడ్జి ముందు హాజరుపరిచి జైలుకు పంపిన విషయం పాఠకులకు తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు రిమాండ్ నివేదికను కూడా జడ్జికి సమర్పించారు. అందులో పలు కీలకమైన విషయాల్ని పోలీసులు వెల్లడించారు. ఈ పత్రాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. రాజయ్య కుటుంబంతో కలిసి సారికను హింసించినవారిలో సన కూడా ఉన్నారని, ఆమె ఇప్పుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అనిల్‌ను ఏ1గా, రాజయ్యను ఏ2గా, మాధవిని ఏ3గా, సనాను ఏ4గా చేర్చారు. ఘటన జరిగినప్పటినుంచి 24 మందిని ప్రశ్నించామని, వారినుంచి సేకరించిన వివరాల మేరకు నివేదిక సమర్పిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు ఈనెల 2వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజయ్య.. తన కుటుంబంతో కలిసి ఇదివరకూ కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలోని పీఎంఆర్ రెసిడెన్సీ ఇంటినెంబరు 202లో ఉండేవారని తెలిపారు. ఎన్నికల్లో ఓటు సారిక ఉన్న ఇంటిపేరుమీదే ఉండటంతో అందరూ కలిసి 3వ తేదీ అక్కడికి వచ్చారు. అప్పుడు సనా కూడా ఆ ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురూ కలిసి హింసించారని తెలిపారు. తనకు న్యాయం కావాలని కోర్టులు చుట్టూ తిరగడం, కేసులు పెట్టడం మీదే వారు వ్యతిరేకించారని చెబుతున్నారు. ఈ రకమైన హింసకారణంగానే ఆమె తన జీవితం మీద విరక్తి తెచ్చుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఎంపీ గా గెలిస్తే ఇంకా హింసిస్తారని..
రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి.. మళ్లీ ఎంపీ అయితే తమని ఇంకా హింసిస్తారని, రాజకీయ పలుకుబడితో పలురకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని ఆమె భావించినట్లు సన్నిహితుల ద్వారా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇందుకు పిల్లలు కూడా బలికావాల్సిందే అని తను భావించిందని, ఈ నేపథ్యంలో ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడిందని తెలిపారు. వంటగదిలో ఉన్న సిలిండర్‌ను తనే తీసుకెళ్లిందని, గ్యాస్ లీక్ చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 4 నుంచి 4.30గంటల మధ్యలో జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌కు వెళ్లే రాజయ్య.. ఆ రోజు కూడా అలా లేచిన తర్వాత.. ఏదో వాసన రావడం గమినించారని.. ఆ తర్వాత చుట్టుపక్కలవారు ఇంట్లో పొగలొస్తున్నాయని చెప్పడంతో ఇంట్లోవాళ్లతో కలిసి గమనించారని తెలిపారు. డ్రైవర్లు, ఇంటి చుట్టుపక్కలవారు కలిసి డోరు పగులగొట్టారని.. అప్పటికి లోపల డోర్ గడియపెట్టి ఉందని వివరించారు.
అనిల్ రెండో భార్యకు ఇద్దరు పిల్లలు
సారికతో ప్రేమ వివాహం చేసుకున్న అనిల్.. సనా అనే మహిళను రెండో భార్యగా స్వీకరించారని తెలిపారు. అనిల్, సనా బంధంతో వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ బంధం మీద కూడా సారిక అనిల్‌ను ప్రశ్నించేదని.. కానీ అతను పట్టించుకునేవాడుకాదని.. రాజయ్య, మాధవి కూడా అతన్నే వెనకేసుకొచ్చేవారని వివరించారు. సారికను వీరంతా సనాతో కలిసి మానసికంగా, శారీరకంగా హింసించారని తేలినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత టీవీల్లో సారిక, పిల్లలు మృతిచెందారని తెలిసి.. హైదరాబాద్‌లో సారిక కేసును వాదిస్తున్న న్యాయవాది రెహానా కూడా పోలీసులతో సంప్రదించారని, గతంలో సారిక తనకు పంపిన ఈమెయిల్‌ను కూడా పోలీసులకు అందించడం జరిగిందని వివరించారు. స్వాధీనం చేసుకున్న ఆధారాల్ని ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపడం జరిగిందని, ఆ నివేదికలు రాగానే.. మిగిలిన విచారణ కూడా పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు కోర్టుకు నివేదించారు.