సార్క్ దేశాలతో కలిసి విపత్తులను ఎదుర్కొంటాం
– ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
దిల్లీ,నవంబర్29(జనంసాక్షి): సార్క్ సభ్యదేశాలతో కలిసి విపత్తులను సమర్ధంగా ఎదుర్కొంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రధాని వివిధ అంశాలపై దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావం ఎంత వేగవంతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. విపత్తులను ఎదుర్కోనే సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో సార్క్ దేశాలతో కలిసి చర్చించానని తెలిపారు. ఈ మేరకు విపత్తుల విషయంలో కలిసి పనిచేయాలని సార్క్ సభ్యదేశాలను కోరినట్లు మోదీ తెలిపారు. నేపాల్‌లో భూకంపం వచ్చినపుడు పాక్ ప్రధానితో మాట్లాడినట్లు చెప్పారు. నవంబర్ 27న అవయవదాన దినోత్సవం జరుపుకొన్నామని, అవయవదానం వల్ల విలువైన జీవితాలను రక్షిస్తున్నామని, అవయవదానాన్ని మించిన గొప్పదానం ఏముంటుందని మోదీ పేర్కొన్నారు. అవయవదానంపై నినాదం, దాతల గుర్తింపుకార్డు, లోగో విన్యాసంపై జాతీయ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు 3న వికలాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వికలాంగుల దృఢ సంకల్పం, ‘య్రర్యం మనకు స్ఫూర్తి అన్నారు. పౌరులుగా ప్రభుత్వ అధికారులతో మనకు చేదు అనుభవం ఎదురై ఉంటుందని ,కానీ మంచి పనులు చేసే ప్రభుత్వ అధికారులను మనం గుర్తించాలని కోరారు.