సార్ట్ ఫిల్మ్ పేరుతో అర్థరాత్రి యువకుల హల్‌చల్
– భయాందోళనకు గురైన స్థానికులు
– యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ, మే25(జనంసాక్షి) : విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో గురువారం అర్ధరాత్రి కొందరు యువకులు హల్‌చల్ చేశారు. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకొని స్ధానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఓ స్టార్ట్ ఫిల్మ్ షూట్ నేపథ్యంలో ఎలాంటి అనుమతి లేకుండా, స్థానికులకు తెలియకుండా షూట్ చేసేందుకు యువకులు ప్లాన్ వేశారు. ఈ తరుణంలో ఏలూరు రోడ్డులో దేయ్యాల వేషధారణలో ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి రోడ్డపైకి వచ్చారు. అర్ధరాత్రి దెయ్యం వేషాల్లో తిరగడంతో స్ధానికులు, వాహన చోదకులు నిజమైన దెయ్యాలే వచ్చాయనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు వాహనదారులు దెయ్యాల వేషదారణలో ఉన్న వీరిని చూసి తమ వాహనాలను వెనక్కి మళ్లించుకొని వెళ్లిపోయారు. అయినా యువకులు తమ షూటింగ్‌ను కొనసాగించడంతో పలువురు వాహనదారులు పోలీసులకు దెయ్యాల విషయమై సమాచారం అందించారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు దెయ్యాల వేషదారణలో ఉన్న వీరిని గుర్తించి పట్టుకున్నారు. వీరితో పాటు షూట్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు యువకులును స్టేషన్‌కు తరలించారు. ఆకతాయి యువకులని గుర్తించి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి ఆకతాయి చర్యలతో ప్రజలను భయపెడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.