సింగరేణిలో అధిక ఉత్పత్తికి కసరత్తు

ఆదిలాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): పెరుగుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకునేలా చేయాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాన్ని 60 మిలియన్‌ టన్నుల నుంచి మరో అయిదేళ్లలో 90 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తుందని అధికారులు వివరించారు.తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం మన సింగరేణి అని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. కార్మికుల సహకారంతో అనేక విజయాలు సాధిస్తున్నామని అన్నారు. సింగరేణి కాలరీస్‌లో రాబోయే అయిదేళ్లలో 20 ఉపరితల గనులు, 11 భూగర్భ గనులు ప్రారంభించ నున్నట్లు సంస్థ సిఎండి ఎన్‌.శ్రీధర్‌ గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా కార్యాచారణ రూపొందుతోందని అన్నారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో అధిక వృద్ధిరేటు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అనేక బొగ్గు కంపెనీలున్నా ఎక్కడా లేని విధంగా సింగరేణిలో మాత్రమే సొంతంగా ఒక విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పిందన్నారు. ఉపరితల గనులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ఓసీపీ గనులతోపాటు భూగర్భ గనులు ప్రారంభించి సంస్థను ప్రగతి పథంలో నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. కొత్తగనుల ఏర్పాటు ద్వారా సంస్థలో అనేకమంది కొత్త కార్మికులు అవసరముంటుందన్నారు. కొత్తగనుల ప్రారంభం తరువాత వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు.