సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి.
తొర్రూర్ 12 సెప్టెంబర్ (జనంసాక్షి ) ఉత్తర తెలంగాణలో జిల్లాలలో సింగరేణి కాలరీస్ కార్మికులు వేతనాలు పెంచాలని చేస్తున్న సమ్మెకు భారత కార్మిక సంఘాల సమైక్య( ఐ ఎఫ్ టి యు) సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవిఅన్నారు. తొర్రూరులోని ఐఎఫ్టియు కార్యాలయంలో నేడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రవి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా వేతనాలు పెంచాలని కాంటాక్ట్ కార్మికులు కోరిన సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందుకు 30 వేల మంది సమ్మె చేస్తున్నారని అన్నారు. కాంటాక్ట్ కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని బొగ్గును ఉత్పత్తి చేస్తుంటే దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 32 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని, ఇంత ఆదాయానికి కారణమగు కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు దృష్టి పెట్టడం లేదని అన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్ ,జీఎస్టీ పేరుతో ధరలు భారీగా పెరిగినాయన, మరి కార్మికుల వేతనాలు ఎందుకు పెరగటం లేదని రవి ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో 11వ పి ఆర్ సి రాష్ట్ర ఉద్యోగులందరికీ అమలు చేసిందని మరి సింగరేణి కార్మికులకు అది ఎందుకు వర్తించదని అన్నారు .దేశ ప్రజల అన్ని రకాల అవసరాలు తీర్చడానికి బొగ్గులో జీవితాలని బుగ్గిపాలు చేసుకుంటున్న కాంటాక్ట్ సింగరేణి కార్మికులు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరటంనేరమా అని అన్నారు. కార్మికుల కోరికలను, కోర్టు తీర్పులను గౌరవించని సింగరేణి యజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న ఆందోళనలకు పూర్తి బాధ్యత వహించాలని రవి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కే సంపత్,ఉపాధ్యక్షులు శ్రీరాం పుల్లయ్య,కార్యవర్గ సభ్యులు స్వామి హరి వెంకటేష్ రాము వెంకన్న తదితరులు పాల్గొన్నారు.