సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 7 లోపు వేతనాలు చెల్లించాలి
రామకృష్ణాపూర్ ఐ.ఎఫ్.టీ.యు. కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు పట్టణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులకు ఏడో తేదీన వేతనాలు చెల్లించాలని, ఈ విషయమై కార్పొరేట్ జి.ఎం. పర్సనల్ ఆదేశాలు విడుదల చేయడం జరిగిందన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల విషయంలో అనేక పోరాటాల ఫలితంగా ఈ సర్కులర్ విడుదల
అయినప్పటికీ, మందమర్రి జి.ఎం ఆఫీస్ పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి రామకృష్ణాపూర్ పట్టణాలలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు, సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ, కార్మికులకు ఏ తేది రోజున వేతనాలు వస్తాయో, అసలు వస్తాయో లేదో తెలియని దౌర్భాగ్య పరిస్థితి మందమర్రి జి.ఎం. ఆఫీస్ కేంద్రంగా కొనసాగుతోందని వాపోయారు. కాంట్రాక్టర్లు బిల్లులు సకాలంలో సబ్మిట్ చేయడం లేదని సింగరేణి సివిల్ విభాగం అధికారులు అంటున్నా, సింగరేణి అధికారుల మాట వినకుండా కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బందులకు గురి చేసే కాంట్రాక్టర్లను టెండర్లో పాల్గొనకుండా, టెండర్లు వేయకుండా సింగరేణి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం అయ్యే పరిస్థితి లేదన్నారు.
అంతిమంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులు నెల అంత పనిచేసి సరైన టైంలో వేతనాలు రాకపోవడంతోన నిత్యవసర సరుకులు కొనుగోలు పాల బిల్లు, చిట్టీలు, గ్రూపులు, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు సరైన టైంలో చెల్లించ లేక పోతున్నారు. ఇప్పటికైనా సివిల్, సివిక్, సులబ్, బెల్ట్ క్లీనింగ్, రైల్వే సైడింగ్ వ్యాగన్ డోర్ సెట్టింగ్, రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న స్కావెంజర్లు, ఆయాలు, వార్డ్ బాయ్ స్టాఫ్ నర్సులు, స్విమ్మింగ్ పూల్, పి.ఓ ఆఫీస్ హౌస్కీపింగ్, క్యాంటీన్, రోడ్డు స్లీపింగ్, డంపర్ రిపేర్, తదితర కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతినెల ఏడో తేదీలోపు వేతనాలు చెల్లించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు ముత్యాల. వెంకటేష్, మీసాల సత్యం, నీలం శ్రీను, నర్సయ్య, మల్లయ్య, బంగారి నాగరాజు సంపంగి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.