సింగరేణి జాగా… వేసేయ్ పాగా. – బెల్లంపల్లిలో కొనసాగుతున్న కబ్జాల పర్వం. – నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సింగరేణి, మున్సిపల్ అధికారులు. పోటో: 1) అశోక్ నగర్ లో కబ్జాకు గురైన సింగరేణి జాగా. 2) సింగరేణి అధికారులు ప్రచురించిన కరపత్రం.
సింగరేణి జాగా వేసేయ్ పాగా అనే చందంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. సింగరేణిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికానివ్వం అని సింగరేణి ఏరియా ఎస్టేట్ మరియు సెక్యూరిటీ డైరెక్టర్లు చంద్రశేఖర్ మరియు బలరాం కరపత్రాలు ముద్రించి మరీ సంస్థ ఆస్తులను కబ్జాకు గురికాకుండా చూస్తామని ఒకవైపు ప్రకటనలు ఇస్తున్నారు. మరో వైపు స్థానిక అధికారులు ఈ విషయాన్ని ‘మాములుగా’ తీసుకోవడం వల్ల కోట్లాది రూపాయల విలువైన సింగరేణి భూములు పెద్దల చేతిలో ఫలహారం అవుతున్నాయి. పేదలు చిన్న గుడిసె వేస్తే అడ్డుకునే అధికారులు పెద్దల వైపు మాత్రం దృష్టి సారించక పోవడం గమనార్హం. బెల్లంపల్లి ఆశోక్ నగర్ మదర్సా వెనకాల కోట్లాది రూపాయల విలువ చేసే సుమారు ఎకరం భూమి కబ్జాకు గురైంది. ముందు మట్టి కుప్పలు ఉండటం వల్ల ఈ తతంగం బయటికి రాలేదు అని స్థానికులు భావిస్తున్నారు. ఒకవేళ అధికారులకు తెలిసే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన ఎకరం భూమిలో అర ఎకరం లో తొమ్మిది రూములతో మూడు పోర్షన్లు ఏర్పాటు చేశారు. మరో అర ఎకరం ఇంటి ముందు ఖాళీ స్థలం వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఇంత దర్జాగా సింగరేణి భూములు కబ్జాకు గురైతే సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పట్టణంలోని శంషీర్ నగర్ లో కూలీలు, యచకులు, తల దాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టు గుడిసెలు కూల్చివేసిన అధికారులు, పెద్దల జోలికి పోవడానికి ఎందుకు జంకుతున్నారని పట్టణ వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ స్థలాలు సైతం కబ్జా.
బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ స్థలాలపై కూడా కబ్జాల పర్వం కొనసాగుతోంది. పోచమ్మ చెరువు, నూతనంగా నిర్మింస్తున్న మినీ ట్యాంక్ బండ్ సమీపంలో కూడా మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఒక వైపు నెన్నెల, బిమిని, కన్నెపల్లి వెళ్లే రోడ్డు, మరోవైపు బూద, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళే దారి ఇంకో వైపు జీఎం ఆఫీస్ వెళ్లే దారి, ఇంకా బెల్లంపల్లి పాత కూరగాయల మార్కెట్ కు వెళ్లే చౌరస్తాలో మున్సిపల్ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ ముందుగా చిన్న సోడా బండి నుంచి మొదలైన కబ్జా నేడు పక్కా భవనం కట్టే వరకు వెళ్ళింది. అయిన మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి దర్జాగా రోడ్డును ఆనుకొని చేసిన కబ్జాలు మాత్రమే. ఇంకా లోతుగా వెళితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జాలను నివారించాలని కోరుతున్నారు.