సింధుపై కాసుల వర్షం

71471663824_625x300న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది.  ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్లో రజతం సాధించినందుకు గాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.

దాంతోపాటు మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది.

మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు  21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.  ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికి లోనై ఓటమి చెందింది.