సింధూ ర‌జ‌త విజ‌యం వెన‌క కీల‌క వ్య‌క్తి కోచ్

ఒలింపిక్స్‌లో సింధూ ర‌జ‌త విజ‌యం వెన‌క ఉన్న కీల‌క వ్య‌క్తి కోచ్ పుల్లెల గోపీచంద్‌. ఒక కోచ్‌గా చాలా క‌ఠిన‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించేవాడు గోపీచంద్‌. అప్ప‌టి సైనా నెహ్వాల్ నుంచి ఇప్ప‌టి పీవీ సింధూ దాకా గోపీచంద్ కింద శిక్ష‌ణ పొందిన వారు ఎవ‌రైనా స‌రే ఆ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డాల్సిందే. ఆయ‌న తీయ‌రీ మాత్రం మార‌దు. ల‌క్ష్యం నెర‌వేరాలంటే కొన్ని త్యాగాలకు వెన‌కాడ‌కూడ‌ద‌నే సిద్ధాంతాన్ని గోపీ చంద్ న‌మ్ముతారు. ఇప్పుడు అదే థియరీ సింధూ విష‌యంలో వర్క‌వుట్ అయ్యింది.
సింధూను మూడునెల‌లుగా ఫోన్‌కు దూరం ఉంచాడు గోపీచంద్‌. సింధూకు ఇష్ట‌మైన గ‌డ్డ‌పెరుగు, ఐస్‌క్రీమ్‌ల‌ను సైతం తిన‌నివ్వ‌లేద‌ట‌.
ఇప్పుడు ఒలింపిక్స్‌లో ల‌క్ష్యం అందుకోవ‌డంతో సింధూకు ఆమె ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తాన‌న్నారు గోపీ. గ‌త 13 రోజులుగా త‌న ఆహార‌పు అల‌వాట్ల‌పై కొన్ని ఆంక్ష‌లు విధించాన‌ని.. ఇప్పుడు సింధూ త‌న‌కిష్ట‌మైన పెరుగు, ఐస్‌క్రీమ్‌ల‌ను ఎంచ‌క్కా లాగించేయొచ్చ‌ని  చెప్పాడు ఈ మాజీ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్. అయితే గ‌త‌వారం రోజులుగా సింధూ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని కితాబిచ్చాడు గోపీచంద్‌. ప‌త‌క ల‌క్ష్యంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింద‌ని కోచ్ గోపీచంద్ కొనియాడారు. సింధూ సాధించిన విజ‌యంతో త‌నే కాదు యావ‌త్ భార‌తదేశం గ‌ర్వ‌ప‌డుతోంద‌న్నారు గోపీచంద్‌.