సిఎం కావడం కాదు.. జానాకు ఘోర ఓటమి తప్పదు

సాగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య

పార్టీలో చేరిన వారికి ఆహ్వానం

నల్లగొండ,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో గల శ్రీరాంపల్లి గ్రామవాసులు గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సిహ్మయ్య ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం అవుతానని కలలు కంటున్న జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు. మహాకూటమిలాంటి ఎన్ని మాయ కూటములు ఏర్పాటైన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపును ఆపలేవని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుని, అభివృద్ధికి అడుగడునా ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబుతో, టీకాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవడం చారిత్రక తప్పిదమన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేసిందన్నారు.

ప్రకటించని పథకాలను సైతం నాలుగేండ్లలోనే అమలు చేస్తే.. 45ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏనాడూ మ్యానిఫెస్టో పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో జెండా పట్టుకొన్న ప్రతీ కార్యకర్త వంద కారణాలు చెప్తాడు.. మరి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు ఎదిగారే తప్ప నాగార్జున సాగర్‌లో నీటివాటా కోసం ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. యాదాద్రి పవర్‌ప్లాంటును జానా, ఉత్తమ్‌, కోమటిరెడ్డి కాదు కదా.. స్వయంగా రాహుల్‌గాంధీ వచ్చినా అడ్డుకోలేడని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. అత్యంత ప్రజాదరణ కల్గిన కేసీఆర్‌ సీఎం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారనీ అన్నారు. ఎడమ కాలువకు వచ్చిన నీరు కృష్టాడెల్టాకు తరలించుకొని పోతుంటే జానా, ఉత్తమ్‌లు నోరు మెదపని వారికి ఎందుకు ఓటెయ్యాలన్నారు.

 

తాజావార్తలు