సిద్దిపేటలో జాతీయస్థాయి ఈత పోటీలు నిర్వహిస్తాం

– ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తున్నా
– రాష్ట్ర మంత్రి హరీష్‌రావు
– అంతర్‌ జిల్లాల ఈత పోటీలను ప్రారంభించిన మంత్రి
సిద్ధిపేట, మే26(జ‌నం సాక్షి) : రానున్న రోజుల్లో సిద్దిపేటలో జాతీయస్థాయి ఈత పోటీలను నిర్వహిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. క్రీడాకారులు రాష్ట్రానికి జాతీయస్థాయి అవార్డులు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే సిద్దిపేటలో ఈత కోసం శిక్షకుడిని నియమించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి క్రీడలకు వసతులు కల్పిస్తామని ఆయన హరీష్‌ పేర్కొన్నారు. సిద్దిపేట మినీ స్టేడియంలో అంతర్‌ జిల్లాల ఈత పోటీలు మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు.  సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి ఈత పోటీలు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఆరోగ్యానికి ఈతకు మించిన వ్యాయామం లేదని హరీష్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్‌ కల్పించి తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు.  అన్ని జిల్లాల్లో గొప్ప క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.