సిద్దిపేట ఘటనతో సర్వత్రా ఉద్రిక్తత

పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఘటన
బిజెపి నేతల ముందస్తు అరెస్టులు
ఘటనపై కేందర బిజెపి నేతల ఆరా
సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బును బీజేపీ అభ్యర్థి  రఘునందన్‌ రావుకు ఇచ్చేందుకే తెచ్చారని పోలీసులు చెప్పడం, డబ్బు సంచితో కనిపించిన కొందరు పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో  నెలకొన్న ఉద్రిక్తత ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో పట్టణంలో బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకున్నారు. బిజెపి నేతలను ముందస్తు అరెస్ట్‌ చేసారు. దుబ్బాక బీజేపీ అభ్యర్ది రఘునందన్‌ రావు మామ, బంధువుల ఇళ్లలో పోలీసుల దాడిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై…అలాగే పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి రఘునందన్‌ రావు ఉన్నట్లు తెలస్తోంది.  దుబ్బాక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను  బీజేపీ కేంద్ర
పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు.  అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇటు అభ్యర్థి రఘునందన్‌ రావుకు  కేంద్ర ¬మ్‌ మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి పరిస్థితులపై అరా తీస్తున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్‌ వస్తున్నట్లు సమాచారం. స్థానిక లెక్చరర్స్‌ కాలనీలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు మామ సురభి రాంగోపాల్‌ రావుతో పాటు వారి ఇంటి పక్కన ఉన్న అంజన్‌ రావు ఇంట్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టడం, డబ్బుల దొరికాయని పోలీస్‌ కమిషనర్‌ ప్రకతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు ఇంట్లోనూ సోదాలు జరిపామని చెప్పిన తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. అంజన్‌రావు ఇంట్లో మాత్రం రూ. 18.60 లక్షలు స్వాధీనం చేసుకున్నామని,అది రఘునందన్‌ రావుకు ఇచ్చేందుకే తెచ్చినట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇదే  సమయంలో అంజన్‌రావు ఇంటి ముందు డబ్బు సంచితో ఓ కానిస్టేబుల్‌  కనిపించడంతో బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆయన చేతిలోంచి సంచి లాక్కొని అందులోని నోట్ల కట్టలను విూడియాకు చూపించారు. పోలీసులే డబ్బు తెచ్చి సోదాల్లో దొరికినట్లు చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు సిద్దిపేటకు వెళ్లగా వారిని అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను బలవంతంగా వ్యాన్‌లోకి తోశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. దాడికి నిరసనగా సంజయ్‌  కరీంనగర్‌లో దీక్షకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించినా డబ్బులు దొరకక పోవడంతో వారి ఇంటి పక్కనే ఉన్న సురభి అంజన్‌ రావు ఇంట్లో తనిఖీలు చేశారు. అటు తర్వాత అంజన్‌ రావు ఇంట్లో రూ. 18.65 లక్షలు స్వాధీనం చేసుకొని సీజ్‌  చేసినట్లు పోలీసులు  ప్రకటించారు.  ఎలాంటి నోటీసులు లేకుండా తన మామ రాంగోపాల్‌రావు ఇంట్లో ఎలా సోదాలు నిర్వహిస్తారని, తనకేమాత్రం పరిచయం లేని అంజన్‌ రావు అనే వ్యక్తి దగ్గర దొరికిన డబ్బులు తనవేనని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట  వన్‌ టౌన్‌ సీఐ సైదులును రఘునందన్‌ రావు ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. నిబంధనల  ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇచ్చి తనిఖీలు చేయాలని, కానీ పోలీసులు ఇవేవిూ పాటించకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలో రఘునందన్‌ మామ రాంగోపాల్‌రావు ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి హరీశ్‌ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుమార్లు పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సోదాల్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌  చెప్పారు. సిద్దిపేటలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సురభి రాంగోపాల్‌ రావుతో పాటు సురభి అంజన్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వివరించారు. రఘునందన్‌రావుకు రాంగోపాల్‌రావు, అంజన్‌రావు బంధువులని, అంజన్‌ రావు ఇంట్లో దొరికిన డబ్బులను ఎగ్జిక్యూటివ్‌ మెజిస్టేట్ర్‌  సమక్షంలో సీజ్‌ చేశామన్నారు. సీజ్‌ చేసిన డబ్బులను అధికారులకు అప్పగించడానికి తరలిస్తున్న సమయంలో అక్కడ రఘునందన్‌  రావుతో పాటు ఆందోళనచేస్తున్న వారిలో 20 మంది వరకు ఇంట్లోకి చొరబడి అధికారుల నుంచి రూ. 12.80 లక్షలు  దొంగిలించుకుని వెళ్లిపోయారని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో రికార్డుల ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య
ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో బిజెపి నేతలు నిరసనలకు దిగారు.